సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ సెట్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చెన్నైలోని పనయూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఫిల్మ్ స్టూడియోలో విద్యుత్ షాక్ తగలడంతో 28 ఏళ్ల సినీ సిబ్బంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని కార్తికేయన్‌గా గుర్తించగా, అతను ‘జైలర్ 2’ సినిమా ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు వివరాల ప్రకారం.. చెన్నై సమీపంలోని పనయూర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ స్టూడియోలో ‘జైలర్ 2’ సినిమా కోసం ఆర్ట్ డైరెక్షన్ బృందం ఇంటి ఆకారంలో భారీ సెట్ నిర్మాణ పనులు చేపట్టింది. గురువారం మే14న ఈ పనుల్లో పాల్గొన్న 28 ఏళ్ల కార్తికేయన్ అనే యువ టెక్నీషియన్ ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురైనట్లు పోలీసులు తెలిపారు.
సెట్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ లీకేజ్ లేదా విద్యుత్ సంబంధిత సమస్య తలెత్తడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్దారించారు. ఈ ఘటనపై కనత్తూర్ పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి దారితీసిన భద్రతా లోపాలు మరియు ఇతర కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
ఏప్రిల్ 21నే షూటింగ్ కంప్లీట్..
ఇదిలా ఉండగా, ఇటీవల ఏప్రిల్ 21నే చిత్ర నిర్మాణ సంస్థ షూటింగ్ పూర్తైనట్లు ప్రకటించింది. ఏప్రిల్ 21న విడుదల చేసిన ఫొటోల్లో రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ లతో పాటుగా చిత్రబృందం షూటింగ్ ముగింపు వేడుకల్లో పాల్గొంటూ కనిపించారు. అయితే, షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఈ ఘటన ఎలా జరిగిందనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.
ఒకవేళ జైలర్ 2 సీన్స్ కోసం వేసిన సెట్ని తొలిగించే క్రమంలో ఈ ఘటన జరిగిందా? మళ్ళీ రీషూట్ సీన్స్ తీసే క్రమంలో జరిగిందా? అనేది సస్పెన్స్గా మారింది. ఇప్పటివరకు ఈ ఘటనపై నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సన్ పిక్చర్స్ స్పందిస్తేనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Alapparai Kelappurom, Thalaivaru Nerandharam! ⭐💥 It's a wrap for #Jailer2 😎@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/75kLIQBF4w
— Sun Pictures (@sunpictures) April 21, 2026
‘జైలర్ 2’ గురించి:
‘జైలర్ 2’, 2023లో విడుదలైన ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది. మొదటి పార్ట్ దాదాపు రూ. 650 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి విషాదం చోటుచేసుకోవడంతో చిత్రబృందానికి పెద్ద షాక్ అని భావించవచ్చు.
►ALSO READ | PEDDI: చరణ్-బుచ్చిబాబు లాంగ్ డ్రైవ్ వీడియో వైరల్.. క్రేజీ ముచ్చట్లకు ఫ్యాన్స్ ఫిదా
ఈ మూవీలో రజనీకాంత్‌తో పాటు రమ్యకృష్ణ, యోగి బాబు తమ పాత్రలను కొనసాగిస్తుండగా, ఈసారి మరికొంతమంది స్టార్ నటులు అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం మొదటి భాగంలో ఉంటే, రెండో భాగంలో మరింత పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్, ఇంటర్నేషనల్ మాఫియా లింకులు ఉండబోతున్నాయని టాక్. ‘జైలర్ 2 సినిమా సెప్టెంబర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
