రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలం ఫ్లాట్ల విక్రయం ద్వారా రూ.9.80 కోట్ల ఆదాయం

రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలం ఫ్లాట్ల విక్రయం ద్వారా రూ.9.80 కోట్ల ఆదాయం
  • ఈనెల 30 వరకు వేలంపాట

హైదరాబాద్, వెలుగు : బండ్లగూడ రాజీవ్  స్వగృహలో 34  ట్రిపుల్  బెడ్ రూం డీలక్స్, 3, 2 బీహెచ్ కే ఫ్లాట్ల వేలం ప్రక్రియ పూర్తయింది. మొత్తం 34 ఫ్లాట్లను వేలం వేయగా వాటిని కొనుగోలు చేసేందుకు 364 మంది బిడ్  దాఖలు చేశారు. ఎక్కువ కోట్ చేసినవారికి అధికారులు ఫ్లాట్లు కేటాయించారు. సోమ, మంగళవారాల్లో బండ్లగూడలో వేలం నిర్వహించగా పబ్లిక్  నుంచి అనూహ్య స్పందన వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే పబ్లిక్  ఎక్కువ ధరకు కొన్నారు. ఏడు ట్రిబుల్  బెడ్ రూం డీలక్స్ ఫ్లాట్లకు ఒక్క ఎస్ఎఫ్ టీ రూ.3 వేలు అధికారులు ఖరారు చేయగా, అత్యధికంగా రూ.4400, అత్యల్పంగా రూ.3900 కోట్ చేశారు.

3  బీహెచ్ కే లో 6  ఫ్లాట్లకు రూ.2750 నిర్ణయించగా అత్యధికంగా రూ.4925,  అత్యల్పంగా రూ.4050 కోట్  చేశారు. 2 బీహెచ్ కే లో 21 ఫ్లాట్లకు అత్యధికంగా రూ.4300, అత్యల్పంగా రూ.4275  కోట్ చేశారు. ప్రభుత్వం ఖరారు చేసిన ధర కన్నా యావరేజ్ గా 41.87 శాతం ఎక్కువగా కోట్  చేశారు. ఇక ఫ్లాట్ల విక్రయం ద్వారా తొమ్మిదిన్నర కోట్ల రెవెన్యూ వస్తుందని అంచనా వేయగా, రూ.9.80 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. 226 సింగిల్ బెడ్ రూమ్  ఫ్లాట్లకు బుధ, గురు, శుక్రవారాల్లో వేలం జరగనుంది.