రాఘవ వేధింపుల వల్లే రామకృష్ణ కుటుంబం బలి

రాఘవ వేధింపుల వల్లే రామకృష్ణ కుటుంబం బలి
  • అసలు ఎక్కడ ఉన్నడు?
  • అరెస్టు చేశారని ప్రచారం
  • మా అదుపులో లేడంటున్న పోలీసులు
  • టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే వనమా కొడుకు బాగోతాలు ఒకటొకటిగా బయటకు
  • వేధింపుల వల్లే రామకృష్ణ కుటుంబం బలి
  • ఏడాది కింద ఫైనాన్షియర్​ సూసైడ్​
  • మొదటి నుంచి రాఘవ వివాదాస్పదుడే
  • కబ్జాలు, సెటిల్మెంట్లలో హస్తం.. చెప్పినట్లు వినకుంటే ఆఫీసర్లు, పోలీసులు ట్రాన్స్​ఫర్​
  • నేడు కొత్తగూడెం బంద్​కు ప్రతిపక్షాల పిలుపు
  • పోలీసులకు నేనే అప్పగిస్త: ఎమ్మెల్యే వనమా


భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ బాగోతం ప్రకంపనలు సృష్టిస్తున్నది. అతడి వేధింపులు భరించలేకే సూసైడ్​ చేసుకుంటున్నట్లు రామకృష్ణ అనే వ్యక్తి  లెటర్​ రాసి ఈ నెల 3న భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మాహుతికి పాల్పడటం సంచలనంగా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యే కొడుకు ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నా నాలుగు రోజులుగా టీఆర్​ఎస్ హైకమాండ్​ సైలెంట్​గా ఉండటం విమర్శలకు దారితీస్తున్నది. ఇదే క్రమంలో మృతుడు రామకృష్ణ సెల్ఫీ వీడియో ఒకటి గురువారం బయటకు వచ్చింది. తన భార్యను పంపాలని రాఘవ అడిగినందుకే కలత చెంది సూసైడ్​ చేసుకుంటున్నామని సెల్ఫీ వీడియోలో రామకృష్ణ పేర్కొన్నాడు. ఎమ్మెల్యే కొడుకు అరాచకాలు బట్టబయలవుతున్నా అధికార పార్టీ స్పందించకపోవడం ఏమిటని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. నిందితుడ్ని కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గురువారం కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించాయి. వనమా వెంకటేశ్వర్​రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, రాఘవను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశాయి. శుక్రవారం కొత్తగూడెం నియోజకవర్గం సంపూర్ణ బంద్​కు అన్ని పార్టీలు పిలుపునిచ్చాయి. 

రాఘవ వేధింపులకు కుటుంబం బలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాత పాల్వంచకు చెందిన మండిగ రామకృష్ణ (45) సోమవారం తెల్లవారుజామున సూసైడ్​ లెటర్​ రాసి తన భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో పెట్రోల్​పోసుకొని, గ్యాస్​ లీక్​చేసుకొని నిప్పు అంటించుకోవడంతో అదే రోజు రామకృష్ణ, ఆయన భార్య నాగలక్ష్మి(40), కవల పిల్లల్లో ఒకరైన సాహిత్య(11) చనిపోగా.. మరో కూతురు సాహితి(11) చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది. ‘‘మా ఆత్మహత్యకు కారణం మా అమ్మ, అక్కతో పాటు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవ. మా అక్కతో కలిసి ఆస్తి పంపకంలో రాఘవ నాకు అన్యాయం చేసిండు.. అందుకే చనిపోతున్నం’’ అని సూసైడ్​నోట్​లో రామకృష్ణ పేర్కొన్నాడు. పాత పాల్వంచలో మీ సేవా సెంటర్​ నడుపుకుంటున్న రామకృష్ణ  కొంతకాలం కింద దానిని ఇతరులకు ఇచ్చి రాజమండ్రి షిఫ్ట్​ అయ్యాడు. అక్కడ గో డాడి ఆన్​లైన్​ యాప్​ ద్వారా బిజినెస్​ చేస్తున్నాడు. దాదాపు రూ. 35 లక్షలకు పైగా అప్పులు కాగా, తనకు వారసత్వంగా వచ్చే ఆస్తిలో కొంత అమ్మి కట్టాలని భావించాడు. తల్లి సూర్యావతి, అక్క  కొమ్మిశెట్టి వీరమాధవి ఒప్పుకోలేదు. ఈ వ్యవహారంలో రాఘవ ఎంటరై తనకు ఆస్తి పంపకంలో అన్యాయం చేశాడని రామకృష్ణ సూసైడ్​నోట్​లో పేర్కొన్నాడు. సూసైడ్​నోట్​తో పాటు రామకృష్ణ కారులో దొరికిన ఫోన్​ను అదే రోజు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే కొడుకు అయినందునే రాఘవను పోలీసులు అరెస్ట్​ చేయలేదనే విమర్శలు వచ్చాయి. 

ఆందోళనలతో అట్టుడికిన కొత్తగూడెం, పాల్వంచ
రాఘవను వెంటనే అరెస్టు చేయాలని, కొడుకు అరాచకాలకు బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి వనమా వెంకటేశ్వర రావు రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తూ కొత్తగూడెం, పాల్వంచలో పలు పార్టీలు, ప్రజా సంఘాలు గురువారం ఆందోళనలు చేశాయి. ఇంత జరుగుతున్నా టీఆర్​ఎస్​ హైకమాండ్​ ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డాయి. పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా ఇంటిని బీజేపీ నేతలు, కార్యకర్తలు ముట్టడించారు. మూడు గంటలపాటు ఇంటిముందే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​ కోనేరు సత్యనారాయణతో పాటు ఐకార్​ మెంబర్​ బైరెడ్డి ప్రభాకర్​రెడ్డి, జంపన సీతారామరాజు, యడ్లపల్లి శ్రీనివాసకుమార్​ తదితరులను అరెస్టు చేసి పాల్వంచ స్టేషన్​కు తరలించారు.  కొత్తగూడెంలో సీపీఐ అనుబంధ మహిళా సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద రాఘవ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాఘవను అరెస్ట్​ చేయాలని మహిళా సంఘం నేతలు డిమాండ్​ చేశారు. కొత్తగూడెంలోని శేషగిరి భవన్​లో ఆల్​పార్టీ లీడర్లు ప్రెస్​మీట్​ ఏర్పాటు చేశారు. రాఘవను అరెస్టు చేయడంతో పాటు జిల్లా నుంచి బహిష్కరించాలని, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పదవికి రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తూ శుక్రవారం కొత్తగూడెం నియోజకవర్గ బంద్​కు పిలుపునిచ్చారు. 

కబ్జాలు, సెటిల్మెంట్లలో రాఘవ హస్తం
రాఘవ వ్యవహార శైలి మొదటి నుంచీ వివాదాస్పదమే. నియోజకవర్గంలో జరిగే భూ కబ్జాలు, ఇసుక​అక్రమ రవాణా, లిక్కర్​ మాఫియా, ల్యాండ్ సెటిల్​మెంట్లలో ఆయన ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే సిఫార్సుతోనే వచ్చిన పోలీస్​ఆఫీసర్లు, ఇతర అధికారులే ఎక్కువగా సెగ్మెంట్​లో ఉండడంతో రాఘవ వ్యవహారాలను వాళ్లు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.  ఆయన చెప్పినట్లు వినకపోతే ఆఫీసర్లయినా, పోలీసులైనా ట్రాన్స్​ఫర్​ కావాల్సిందేనని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఏడాది కింద రాఘవ వేధింపుల వల్ల తాను చనిపోతున్నట్లు పాల్వంచకే చెందిన ఓ ఫైనాన్షియర్ ​సూసైడ్ నోట్​రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. భూ కబ్జాలను అడ్డుకున్నందుకు తనపై రాఘవ దాడి చేయించారంటూ ఇదే మండలానికి చెందిన ఓ గిరిజన మహిళ పోలీసులతో పాటు మినిస్టర్​సత్యవతి రాథోడ్​కు కంప్లయింట్​ఇచ్చింది.  సుమారు 15 ఏండ్ల కిందట ఓ సెక్యూరిటీ గార్డు మైనర్ ​కూతురుపై  రాఘవ  లైంగిక దాడి చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. కొన్నేండ్ల కింద ఓ ఎస్ఐ భార్యతో సంబంధం పెట్టుకున్నాడని, అతడ్ని ఎదిరించలేక ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రచారం సాగింది. రాఘవ వేధింపులు భరించలేక పాల్వంచ, కొత్తగూడెంలోని ఇద్దరు మున్సిపల్ ​కమిషనర్లు ట్రాన్స్​ఫర్లు చేయించుకున్నట్లు తెలుస్తోంది. పదేండ్ల కింద పాల్వంచ సందిగుట్ట ప్రాంతంలో ఓ దళిత మహిళకు అరగుండు చేయించాడని స్థానికులు చెప్పుకుంటుంటారు. 

తాజాగా సెల్ఫీ వీడియో బయటకు.. 
సూసైడ్​ లెటర్​తోపాటు ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసిన సెల్ఫీ వీడియో గురువారం బయటకు వచ్చింది. అందులో వనమా రాఘవ ఆగడాల గురించి రామకృష్ణ బయటపెట్టాడు. రామకృష్ణ సెల్​ఫోన్​లో ఉన్న  ఈ వీడియో ఎలా లీకైందో ఏమోగానీ గురువారం సోషల్​ మీడియాలో వైరల్​కావడంతో  ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అతని కొడుకు రాఘవతోపాటు టీఆర్​ఎస్​ తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే రాజీనామా చేయాలని, రాఘవను అరెస్ట్​ చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. రూలింగ్​పార్టీ ఎమ్మెల్యే కొడుకు అయినందునే రాఘవను పోలీసులు అరెస్ట్​ చేయట్లేదనే విమర్శలు వచ్చాయి. 

నా కొడుకుని పోలీసులకు అప్పగిస్త: వనమా
నాలుగు రోజులుగా రాఘవ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తుండటంతో పార్టీకి డ్యామేజ్​ అవుతున్నదని భావించిన టీఆర్​ఎస్​  పెద్దలు గురువారం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు ఫోన్​ చేసి.. మొత్తం విషయంపై ఆరా తీసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే వనమా ప్రజలు బహిరంగ లేఖ విడుదల చేశారు.  తన కొడుకును  పోలీసులకు అప్పగించేందుకు రెడీగా ఉన్నానని, కేసు విచారణ నిష్పక్షపాతంగా కొనసాగేందుకు సహకరిస్తానని పేర్కొన్నారు. తన కొడుకు రాఘవ నిర్దోషిగా తేలేంత వరకు నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. సోషల్​ మీడియాలో తిరుగుతున్న రామకృష్ణ సెల్ఫీ వీడియో తనను ఎంతో మానసిక క్షోభకు గురి చేసిందన్నారు.

రాఘవ ఎక్కడ?
రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్‌‌‌‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవ ఎక్కడ ఉన్నాడన్నది సస్పెన్స్​గా మారింది. ఆయనను హైదరాబాద్​లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు గురువారం సాయంత్రం ప్రచారం జరిగింది. పోలీసులు మాత్రం అరెస్ట్‌‌‌‌ విషయాన్ని  నిర్ధారించడం లేదు. ఈనెల 3న రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్​ చేసుకోగా.. ఆ రోజు నుంచి రాఘవ తప్పించుకు తిరుగుతున్నాడు. సూసైడ్​ నోట్​తోపాటు గురు వారం బయటకు వచ్చిన సెల్ఫీ వీడియోలోనూ రాఘవపైనే ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం హైదరాబాద్​లోని సోమాజిగూడ ప్రెస్‌‌‌‌ క్లబ్‌‌‌‌లో ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌ నిర్వహించేందుకు రాఘవ రాగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరిగింది. హైదరాబాద్​లో అరెస్ట్ చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని పాల్వంచ డీఎస్పీ రోహిత్ రాజు అన్నారు. అరెస్టు చేసేందుకు స్పెషల్ పోలీస్, టాస్క్​ఫోర్స్​ టీమ్​లు తెలంగాణ, ఏపీల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్తున్నారు.