తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం- సీఎంఓలో కీలక మార్పులు జరిగాయి. రాష్ట్ర కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ జాజును నియమించిన ప్రభుత్వం.. మరికొన్ని కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న రామకృష్ణారావును ముఖ్యమంత్రి సలహాదారుగా నియమిస్తూ జీవో విడుదల చేసింది.
జూన్ 30వ తేదీతో రామకృష్ణారావు పదవీ విరమణ చేయనున్నారు. ఆయన రిటైర్మెంట్ పూర్తి కాగానే.. జూన్ 30 నుంచే సీఎం సలహాదారుగా, ఎక్స్ అఫిషియో చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అటు కొత్త సీఎస్ సంజయ్ జాజు కూడా అదే రోజు అంటే.. జూన్ 30 నుంచే తెలంగాణ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
►ALSO READ | తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ..సీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్. శ్రీధర్
ఇక సీఎంఓలో జరిగిన మరో కీలక నియామకంలో.. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్. శ్రీధర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సీఎస్ నియామకం, సీఎం సలహాదారుగా రామకృష్ణారావుకు బాధ్యతలు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్. శ్రీధర్ పోస్టింగ్‌తో.. తెలంగాణ సీఎంఓ సరికొత్తగా రూపుదిద్దుకుంది.
