- 299 టీఎంసీల నీళ్లు చాలని కేసీఆర్ ఒప్పుకున్నడు: రాంచందర్ రావు
- కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో బీఆర్‍ఎస్ నేతలను కాపాడుతుందే కాంగ్రెస్
- డీలిమిటేషన్ తర్వాతే రాష్ట్రంలో జనరల్ ఎలక్షన్స్
- వరంగల్, భువనగిరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన
వరంగల్/ హనుమకొండ/ యాదాద్రి, వెలుగు: కృష్ణా నదీజలాల్లో తెలంగాణకు ఒక్క చుక్క అన్యాయం జరిగినా ఊరుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు స్పష్టం చేశారు. గురువారం ఆయన గ్రేటర్ వరంగల్‌లో, భువనగిరిలో పర్యటించారు. ముందుగా వరంగల్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. భద్రకాళి ఆలయంలో పూజల అనంతరం ఆయన హనుమకొండ, వరంగల్‍జిల్లాల కార్యకర్తల మీటింగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదీజలాల వివాదానికి కేసీఆరే కారణమన్నారు.
అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ హాజరు కాలేదని, పైగా కృష్ణాజలాల్లో 299 టీఎంసీలు చాలని సంతకం చేశారని చెప్పారు. నీళ్ల వాటాల విషయంలో తెలంగాణకు నష్టం జరిగిలా ఎలాంటి ఒప్పందం జరిగినా వ్యతిరేకిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఫోన్‌ట్యాపింగ్ కేసుల్లో బీఆర్‍ఎస్ నేతలను కాంగ్రెస్‌పార్టీనే కాపాడుతోందని రాంచంద్రరావు ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష 30 వేల కోట్ల అవినీతి జరిగితే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రూ.10 వేల కోట్లకు సంబంధించి 3 బ్యారేజీలపై మాత్రమే సీబీఐ విచారణ అడుగుతోందని విమర్శించారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులోనూ ఆఫీసర్లపైన మాత్రమే కేసులు పెట్టారని, బీఆర్‍ఎస్ నేతలను వదిలేస్తున్నారని ఆరోపించారు. వరంగల్ లో కాకతీయ యూనివర్సిటీ భూములను కాంగ్రెస్ప్రభుత్వం అమ్మేసే ప్రమాదముందని హెచ్చరించారు.
బీజేపీ భయంతోనే.. కేసీఆర్ బయటకొచ్చిండు
రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందన్న భయంతోనే చాన్నాళ్ల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చాడని రాంచందర్ రావు అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఐదు వేల గ్రామాల్లో పోటీ చేసి వెయ్యి గ్రామాల్లో గెలిచారని ఆయన తెలిపారు.
ఈ ఎన్నికల్లో తమకు ఓటు బ్యాంకు పెరిగి, మరింత బలపడిందన్నారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ బలపడుతోందని గుర్తించిన కేసీఆర్.. ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారని తెలిపారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదని, కాంగ్రెస్, బీఆర్‍ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడే బూతులు, అన్‍పార్లమెంటరీ భాషను చూసి ప్రజలు అసెంబ్లీ లైవ్‍లో టీవీలు బంద్‍చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో డీలిమిటేషన్ పూర్తయ్యకే జనరల్ ఎలక్షన్లు జరుగుతాయని, ఈ ప్రక్రియ కోసం త్వరలో కమిషన్ వస్తుందన్నారు. రాష్ట్రంలోని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని, సర్దుబాట్లు కూడా ఉండవని చెప్పారు. ఆయన వెంట గంటా రవికుమార్, కొలను సంతోష్‍రెడ్డి, ఉట్కూరు అశోక్‌గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, ఎర్రబెల్లి ప్రదీప్‍రావు, మార్తినేని ధర్మారావు, అరూరి రమేశ్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, పడాల శ్రీనివాస్
తదితరులు ఉన్నారు.
