రామాయణ.. సినిమా కాదు.. ఇండియా డ్రీమ్: రణ్ బీర్ కపూర్ 

రామాయణ.. సినిమా కాదు.. ఇండియా డ్రీమ్: రణ్ బీర్ కపూర్ 

రణ్‌‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతాదేవి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రామాయణ’.  నితేష్ తివారీ  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సమర్పణలో  డి‌‌నెగ్, మాన్‌‌స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో  నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌‌తో నిర్మిస్తున్నారు. ఇందులో రావణుడి పాత్ర పోషిస్తున్న కన్నడ స్టార్ యశ్ కో ప్రొడ్యూసర్‌‌‌‌గా వ్యవహరిస్తున్నాడు. జులై 24న ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేయనున్నారు. ఈలోపు ‘ప్రథమ్ సంకల్ప్’ పేరుతో శనివారం ఢిల్లీలో గ్రాండ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా  రణ్‌‌బీర్ కపూర్ మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుంచి శ్రీరాముడి కథలు వింటూ, ఆయన నామస్మరణ, ఆశీస్సులతో పెరిగాను. 

అలాంటి శ్రీరాములవారి పాత్రను పోషించే అవకాశం రావడం  అదృష్టంగా భావిస్తున్నా’ అని అన్నాడు. యశ్ మాట్లాడుతూ ‘ఇది కేవలం ఒక సినిమా కాదు..  ఇండియా డ్రీమ్. ఆ కలను నిజం చేయడం కోసం మేమంతా ఒక్కటిగా కలిసి పనిచేశాం. శ్రీరాములవారి  కథను ప్రపంచ స్థాయిలో అత్యంత గొప్పగా చెప్పాలన్నదే మా లక్ష్యం’ అని అన్నాడు.  సాయి పల్లవి మాట్లాడుతూ ‘సీతమ్మ పాత్రను పోషించడం  అదృష్టంగా భావిస్తున్నా.  

ఈ పాత్రను పోషించే క్రమంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా.  ఈ ప్రయాణం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవంగా నిలిచిపోతుంది’ అని చెప్పింది.  దర్శకుడు నితేశ్ తివారీ మాట్లాడుతూ ‘ప్రపంచంలో చెప్పబడిన గొప్ప కథల్లో ఒకటి  రామాయణం.  ప్రేక్షకులు ఈ సినిమాలో కేవలం విజువల్ స్పెక్టకిల్ మాత్రమే కాకుండా, రామాయణంలోని భావోద్వేగం, మానవత్వం, వేల ఏళ్లుగా దాన్ని చిరస్థాయిగా నిలబెట్టిన ఆత్మను కూడా అనుభవిస్తారని ఆశిస్తున్నా’ అని అన్నాడు. 

ఇది భారతదేశపు సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచంతో పంచుకునే ఒక మహా ప్రయాణానికి శ్రీకారం అని నిర్మాత నమిత్ మల్హోత్రా  అన్నారు.  ఈ చిత్రంలో  దశరథ మహారాజు పాత్రలో అరుణ్ గోవిల్,  కైకేయి పాత్రలో శోభన, విశ్వామిత్ర మహర్షిగా అజింక్య దేవ్,  ఇంద్రుడిగా కునాల్ కపూర్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మణుడిగా రవీ దూబే  కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ‘రామాయణ : పార్ట్‌‌ 1’ పేరుతో దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.