ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా ఆర్డీవోలు

ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా ఆర్డీవోలు

సర్కారు దవాఖాన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా ఆర్డీవో(రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్)లను నియమించనున్నట్టు మంత్రి హరీశ్​ రావు ఇవాళ శాసన మండలిలో ప్రకటించారు. ప్రస్తుతం ప్రతి ఏరియా దవాఖానలో  సూపరింటెండెంట్ల వ్యవస్థ ఉన్నదని, వారిపై పర్యవేక్షణకు ఆర్డీవోలను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా నియమించనున్నట్టు తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఆర్డీవోల వ్యవస్థకు మంగళం పాడునున్నారనే వాదనకు బలం చేకూర్చేలా ఉండటం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం మొదట మండల రెవెన్యూ అధికారులను తహసీల్దార్లుగా, రెవెన్యూ ఇన్ స్పెకర్టర్లను గిర్దావర్లుగా మార్చిన విషయం తెలిసిందే. 

తర్వాత వీఆర్వో(విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల) వ్యవస్థను రద్దు చేసి వాళ్లను వేరేశాఖల్లో సర్దుబాటు చేసింది. ఇటీవల వీఆర్ ఏల వ్యవస్థను రద్దు చేసింది. వాళ్లను ఇతర శాఖల్లో అడ్జెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వీఆర్వో, వీఆర్ఏల వ్యవస్థ రద్దు తర్వాత క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక ఇచ్చే వారు కరువయ్యారు. ప్రస్తుతం ఆర్డీవోల సేవలను ఆస్పత్రుల అడ్మినిస్ట్రేషన్ విధుల్లో వినియోగించుకోనున్నట్టు మంత్రి చేసిన ప్రకటన కొత్త చర్చకు దారి తీసింది. 

అనేక అనుమానాలు

తెలంగాణలో 74 రెవెన్యూ డివిజన్లున్నాయి. రాష్ట్రం ఏర్పడేనాటికి వాటి సంఖ్య తక్కువగా ఉండేది. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా డివిజన్ల సంఖ్యను కూడా పెంచింది. లాఅండ్ ఆర్డర్ సమస్య తలెత్తినప్పుడు ఆర్డీవో ఎగ్జిక్యూటివ్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పవర్స్ వినియోగించుకునే అవకాశం ఉంటుంది. భూ వివాదాల పరిష్కారం, రెవెన్యూ యంత్రాంగం నిర్వహణ, జనన ధ్రవీకరణ పత్రాల జారీ, తన డివిజన్ పరిధిలోని పెట్రోల్ బంక్ లు, సినిమా హాళ్లపై నియంత్రణ ఉండేది. 

ఇంకా ఇతర వ్యవహారాలతో పాటు ప్రొటోకాల్ విధులనూ నిర్వర్తించేవారు. ధరణి అందుబాటులోకి వచ్చాక ఆర్డీవోల ప్రాధాన్యాన్ని ప్రభుత్వం క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. కొత్త డివిజన్లు ఏర్పాటు చేసినప్పటికీ వీరికి సరైన ప్రాధాన్యం ఇవ్వలేదనే ఆరోపణ ఉంది. ఇటీవలే వీఆర్వో, వీఆర్ఏ పోస్టులను  రద్దు చేసిన ప్రభుత్వం ఈ సారి ఆర్డీవోల వ్యవస్థను రద్దు చేస్తుందా..? అనేది మంత్రి ప్రకటనతో చర్చనీయాంశంగా మారింది.