
కబ్జాలకు గురైన ఆలయ భూములపై స్పెషల్ డ్రైవ్రాష్ట్రంలోని ఆలయాల భూముల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సమగ్ర భూ సర్వేలో భాగంగా ఆలయ భూ రికార్డుల ప్రక్షాళన చేశామని, కబ్జాకు గురైన వెయ్యి ఎకరాలను వెనక్కి తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో 13 వేల ఆలయాల పరిధిలో 82 వేల ఎకరాల భూములున్నాయని, వీటిలో 20 వేల ఎకరాల వరకూ కబ్జాలకు గురయ్యాయని అన్నారు. కబ్జాలకు గురైన భూముల సేకరణకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోందన్నారు. దేవాదాయ శాఖ కమిషనరేట్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
సీసీఎల్ఏ సహకారంతో ఆలయ భూముల వివరాలను ఆన్ లైన్ చేస్తున్నామని, ఆలయాల భూములకు సంబంధించి దేవుడి పేరుతో పట్టాలు ఇస్తామని చెప్పారు. భూ రికార్డులను అన్‌లైన్ చేసి దేవుడి పేరుతో పట్టాలు ఇవ్వడంతో భవిష్యత్త్‌లో వాటిని ఇతరులు మార్చుకునే అవకాశం ఉండదని, కబ్జా కాకుండా చూడొచ్చని అన్నారు. 21,339 ఎకరాలకు గతంలోనే పాస్ బుక్ లు జారీ అయ్యాయని, త్వరలో 59,898 ఎకరాలకు దేవుళ్ల పేరిట పట్టాదారు పాస్ బుక్‌లు జారీ చేస్తామని తెలిపారు.
కొత్తగా 4 ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలు
జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి, వరంగల్ భద్రకాళీ ఆలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్, ధర్మపురిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆన్‌లైన్ సేవలు మొదలయ్యాయి. ఈ ఆలయాలకు సంబంధించిన ఆన్ లైన్ సేవలను ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. స్మార్ట్ ఫోన్లలో ‘T APP FOLIO’ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని, మీ సేవా ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఈ సేవలను పొందవచ్చని తెలిపారు. సుప్రభాతం, అభిషేకం, అర్చనలు, వ్రతాలు, హోమాలు, వాహన సేవలు, ఏకాంత సేవలు, పవళింపు సేవలు ఆన్ లైన్ ద్వారా పొందవచ్చని, అకామిడేషన్ సర్వీసులతోపాటు డొనేషన్లు అందించవచ్చని వెల్లడించారు.
యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయం, కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవస్థానం, బాసర జ్ఞాన సరస్వతి ఆలయాల్లో ఇప్పటికే ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. సికింద్రాబాద్ గణేశ్ ఆలయంతోపాటు కొమురవెల్లి మల్లిఖార్జునస్వామి ఆలయంలోనూ త్వరలో ఆన్ లైన్ సేవలు ప్రారంభిస్తామని తెలిపారు. వేములవాడ గుడి చెరువులోకి మిడ్ మానేరు ద్వారా కాళేశ్వరం జలాలను గురువారం వదులుతామని చెప్పారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ప్రసాదాన్ని కొరియర్ ద్వారా భక్తులు కోరుకున్న చోటుకు పంపుతామని, గురువారం నుంచే ఈ సేవలను అందుబాటులోకి తేస్తామని చెప్పారు.