రిలయన్స్ జియో తన 50 కోట్ల మంది వినియోగదారులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. నెలకు 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే చిరాకును దూరం చేస్తూ.. సరిగ్గా క్యాలెండర్ నెల అంతా పనిచేసే కొత్త రూ.339 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా.. ప్రతి నెలా ఒకే తేదీన రీఛార్జ్ చేసుకునే సౌలభ్యాన్ని ఈ ప్లాన్ కల్పిస్తోంది. ఈ కొత్త ప్లాన్ ప్రయోజనాల గురించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..
క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ:
చాలా కాలంగా మొబైల్ వినియోగదారుల నుంచి మెయిల్ కంప్లెయింట్స్ ఏమిటంటే.. 28 రోజుల వ్యాలిడిటీ వల్ల ఏడాదికి 12 సార్లు కాకుండా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోందన్నదే. ఈ సమస్యకు పరిష్కారంగా జియో ఈ రూ.339 ప్లాన్‌ను తెచ్చింది. దీని కింద ఒక కస్టమర్ ఈ నెల 10వ తేదీన రీఛార్జ్ చేస్తే.. వచ్చే నెల 10వ తేదీ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే నెలలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల పాటు సేవలు అందుతాయి. నెలలో 28, 30, 31 రోజులు ఏది ఉన్నా సరే.. సరిగ్గా ఒక నెల పాటు వ్యాలిడిటీ లభిస్తుందన్నమాట.
డేటా అండ్ కాలింగ్ బెనిఫిట్స్..
ఈ ప్లాన్ కింద యూజర్లు ప్రతిరోజూ 1.5GB హై-స్పీడ్ డేటా పొందుతారు. రోజువారీ పరిమితి ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 Kbpsకి తగ్గుతుంది. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఏదైనా నెట్‌వర్క్‌కు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు ఉచితంగా లభిస్తాయి. అదనంగా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి యాప్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా అందిస్తోంది టెలికాం దిగ్గజం.
రూ.319 ప్లాన్‌కు.. దీనికి తేడా ఏంటి?
జియో ఇప్పటికే రూ.319 తో ఇలాంటి నెలవారీ ప్లాన్‌ను అందిస్తోంది. అయితే కొత్త రూ.339 ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో రూ.14.95 విలువైన టాక్‌టైమ్ అదనంగా లభిస్తుంది. ఇంటర్నేషనల్ కాల్స్ లేదా ఇతర వ్యాల్యూ యాడెడ్ సర్వీసుల కోసం టాక్‌టైమ్ అవసరమయ్యే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో పాటు జియో ఏఐ క్లౌడ్ యాప్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందించబడుతోంది.
ఈ ప్లాన్ కేవలం 1.5GB డైలీ డేటాతో వస్తుంది కాబట్టి.. ఇందులో అన్‌లిమిటెడ్ 5G డేటా బెనిఫిట్ ఉండదు. జియో రూల్స్ ప్రకారం రోజుకు 2GB లేదా అంతకంటే ఎక్కువ డేటా ఇచ్చే ప్లాన్‌లపైనే 5G వెల్‌కమ్ ఆఫర్ వర్తిస్తుంది. కాబట్టి 4G వినియోగదారులకు, నెలవారీ బడ్జెట్‌ను పక్కాగా ప్లాన్ చేసుకునే వారికి ఈ రూ.339 ప్లాన్ ఒక సరైన ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఏటా 13వ రీఛార్జ్ భారాన్ని తప్పించుకోవాలనుకునే కోట్లాది మంది సామాన్య వినియోగదారులకు ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
