ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ విరమణ కోసం జరుగుతున్న చర్చలు విఫలమయ్యాయి. సీజ్ ఫైర్ ను ఒప్పుకోవటం లేదని ఇరాన్ షాకింగ్ ప్రకటన చేసింది. సీజ్ ఫైర్ ను తిరస్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ద్వారా వెల్లడించినట్లు ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. తాత్కాలిక విరమణకు ఇరాన్ ఒప్పుకోదని.. శాస్వతంగా యుద్ధం ముగించే ప్రత్యామ్నాయం ఉంటే ఆలోచిస్తామని ఇరాన్ పేర్కొంది.
ముందునుంచి చెప్తున్నట్లుగా తమ 10 కండిషన్లను ఒప్పుకుంటేనే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని ఇరాన్ ఖరాకండిగా చెప్పేసింది. ఇరాన్ తో పాటు లెబనాన్, గాజాల్లోనూ యుద్ధం ఆగాలని, అదే సమయంలో తాము డిమాండ్ చేస్తున్న గ్యారెంటీలకు ఒప్పుకోవాలని డిమాండ్ చేసింది.
ఇరాన్ పెట్టిన10 కండిషన్లలో హర్మూజ్ జలసంధిపై పూర్తిస్థాయి ఆధిపత్యం, అక్కడి నుంచి వెళ్లే నౌకలపై టోల్స్ వసూలు చేసే అధికారం, హార్మూజ్ రవాణాను నియంత్రించే అధికారం మొదలైనవి ముఖ్యమైనవి. ఒప్పందానికి రాకుంటే ఇరాన్ చమురు క్షేత్రాలు, మౌళిక సదుపాయాలపై బాంబులు వేస్తామని ట్రంప్ బెదిరించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ సీజ్ ఫైర్ కు తిరస్కరించడం గమనార్హం.
ఇరాన్ పెట్టిన కండిషన్లలో న్యూక్లియర్ హక్కుల అంశం కూడా కీలకమైనది. దేశంపై ఉన్న ఆర్థిక సాంక్షన్లను ఎత్తివేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తోంది. సాంక్షన్స్ వలన ఇరాన్ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొంది. ఇక యూరేనియం నిల్వలు పెంచుకోవడం, అణువిద్యుత్ ఉత్పత్తి మొదలైన అణు కార్యక్రమాలకు అనుమతించాల్సిందిగా ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అప్పుడు మాత్రమే సీజ్ ఫైర్ కు ఒప్పుకుంటామని పేర్కొంది.
- ట్రంప్ స్ట్రాంగ్ రియాక్షన్:
సీజ్ ఫైర్ ను ఇరాన్ తిరస్కరించడంపై ట్రంప్ తీవ్రంగా పరిగణించారు. దీనికి చాలా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని అన్నారు. వెంటనే ఇరాన్ పై దాడి చేయకపోయినా.. సీరియస్ యాక్షన్ త్వరలోనే చూస్తారని అన్నారు. ఇరాన్ కోలుకోడానికి ఏళ్లు పడుతుందని హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని త్వరలోనే ముగిస్తామని అన్నారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని మేము అంగీకరించమని చెప్పారు. మరోవైపు తాము చేసే అణు కార్యక్రమాలు అణ్వాయుధాల కోసం కాదని.. అణు విద్యుత్ తయారు చేసేందుకేనని ఇరాన్ వాదిస్తూ వస్తోంది.
