Cameron Green: రూ. 25 కోట్లు దండగేనా.. కేకేఆర్‌ను నిరాశపర్చిన గ్రీన్..  

Cameron Green: రూ. 25 కోట్లు దండగేనా.. కేకేఆర్‌ను నిరాశపర్చిన గ్రీన్..  

Cameron Green: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) వేలంలో ఏకంగా రూ. 25.20 కోట్ల భారీ ధరకు అమ్ముడై, చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచిన కామెరాన్ గ్రీన్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నాడు. ఈరోజు (2026, ఏప్రిల్ 6న) ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అతడు తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. ఓపెనర్ ఫిన్ అలెన్ త్వరగానే అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన గ్రీన్, తాను ఎదుర్కొన్న మొదటి బంతికే ఫోర్ కొట్టి శుభారంభం చేసినప్పటికీ, ఆ మరుసటి బంతికే అవుటయ్యాడు. జేవియర్ బార్ట్‌లెట్ వేసిన అవుట్-స్వింగర్ బంతికి వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి కేవలం 4 పరుగులకే వెనుదిరిగాడు.

ఇప్పటివరకు గ్రీన్ చేసిన పరుగులు:
* ముంబై ఇండియన్స్‌పై: 18 పరుగులు (10 బంతుల్లో)
* సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై: 2 పరుగులు (రన్ అవుట్)
* పంజాబ్ కింగ్స్‌పై: 4 పరుగులు

కలవరపెడుతున్న గ్రీన్: 
మొత్తంగా ఈ సీజన్‌లో ఆడిన మ్యాచ్‌ల్లో  కామెరాన్ గ్రీన్ కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. 10 కంటే తక్కువ సగటుతో ఆడుతుండటం కేకేఆర్ మేనేజ్‌మెంట్‌ను తీవ్రంగా కలవరపెడుతోంది. ఆల్‌రౌండర్‌గా జట్టుకు సమతుల్యత ఇస్తాడని భావించి భారీ ధర పెట్టి కొనుగోలు చేస్తే,  అతడి బౌలింగ్‌లోనూ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఈ టోర్నమెంట్‌లో అతను ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక ఓవర్ బౌలింగ్ చేశాడు. అయితే గ్రీన్ గతంలో వెన్నునొప్పితో బాధపడటంతో పాటు వర్క్‌లోడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని క్రికెట్ ఆస్ట్రేలియా కేకేఆర్ ఫ్రాంచైజీకి సూచించింది. దీంతో అతను పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయలేకపోతున్నాడు.

కేకేఆర్ ఆందోళన: 
కేకేఆర్ భారీ ధర పెట్టి కొనుగోలు చేసినా.. అటు బ్యాటింగ్‌లో పరుగులు చేయక, ఇటు బౌలింగ్ చేసే అవకాశం లేక కామెరాన్ గ్రీన్ జట్టుకు 'భారంగా' మారుతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. తన తర్వాతి మ్యాచ్‌ల్లోనైనా పుంజుకుని తనని తాను నిరూపించుకుంటాడో లేదో చూడాలి. కాగా, ఈరోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న పోరు వర్షం కారణంగా ఆగిపోయింది. 3.4 ఓవర్లలోనే కేవలం 25 పరుగులు చేసి కీలకమైన 2 వికెట్లని కేకేఆర్ నష్టపోయింది.