చెన్నై: తమిళనాడులో 2020లో.. కరోనా సమయంలో సంచలనం సృష్టించిన సాతంకుళం కస్టోడియల్ డెత్ కేసులో మధురై ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో బాధ్యులుగా ఉన్న 9 మంది పోలీసులకు మరణ శిక్ష విధిస్తూ మద్రాస్ హైకోర్టు పరిధిలోని మధురై బెంచ్ తీర్పు వెల్లడించింది. ఆరేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జి.ముత్తుకుమార్ ఈ తీర్పును వెలువరించారు.
కస్టడీలో పక్కా ప్లాన్తో బాధితులను టార్చర్ చేశారని.. రాత్రంతా నరకం చూపించారని.. అందువల్ల వీలైనంత కఠినంగా నిందితులను శిక్షించాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) చేసిన వాదనను కోర్టు సమర్థించింది. దోషులుగా తేలిన వారిలో ఇన్‌స్పెక్టర్ ఎస్. శ్రీధర్.. సబ్-ఇన్‌స్పెక్టర్లు పి. రఘు గణేష్ , కె. బాలకృష్ణన్.. హెడ్ కానిస్టేబుళ్లు ఎస్. మురుగన్, ఎ. సమదురై.. కానిస్టేబుళ్లు ఎం. ముత్తురాజ్, ఎస్. చెల్లదురై, ఎక్స్. థామస్ ఫ్రాన్సిస్, ఎస్. వేలుముత్తు ఉన్నారు. పదవ నిందితుడైన స్పెషల్ సబ్- ఇన్‌స్పెక్టర్ పాల్దురై, ఈ కేసు విచారణలో ఉండగానే కోవిడ్-19తో మరణించారు.
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఓ మొబైల్ స్టోర్ నడుపుకునే తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(30) లను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపుల సమయం కన్నా ఎక్కువ సేపు షాపు తెరిచి ఉంచారన్న ఆరోపణపై వారిద్దరినీ స్టేషన్కు తీసుకెళ్లి కోవిల్పట్టి సబ్‌జైలులో రిమాండ్ చేశారు.
జైలు నుంచి విడుదలైన తండ్రీకొడుకులు పోలీసులు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక అనారోగ్యంపాలవడంతో కోవిల్పట్టి జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. బెనిక్స్ మరణించాడు. అతని తండ్రి జయరాజ్ ఆ మరుసటి రోజు ఉదయం చనిపోయారు. పోలీసులు వారిని దారుణంగా టార్చర్ చేశారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతోనే వారికి తీవ్ర రక్త స్రావం అయిందని, ఆస్పత్రిలో చేర్పించగా చనిపోయారని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఈ విషయం అప్పట్లో సంచలనం రేకెత్తించింది.
ఈ ఘటనపై తూత్తుకుడి జిల్లాలో నిరసనలు వెల్లువెత్తిన క్రమంలో.. మద్రాస్ హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారించింది. ఈ కేసుతో సంబంధమున్న పోలీసులిద్దరిని సస్పెండ్ చేస్తూ.. మృతుల పోస్టుమార్టంను వీడియో తీయాలని ఆదేశించింది. ఆరేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత మధురై న్యాయస్థానం 9 మంది పోలీసులకు మరణ శిక్ష విధిస్తూ సోమవారం (ఏప్రిల్ 6, 2026) తీర్పు ప్రకటించింది.
