Dinesh Karthik: స్టేడియంలో వాటర్ బాటిల్ కోసం వాగ్వాదం.. అంపైర్‌పై RCB కోచ్ ఫైర్ 

Dinesh Karthik: స్టేడియంలో వాటర్ బాటిల్ కోసం వాగ్వాదం.. అంపైర్‌పై RCB కోచ్ ఫైర్ 

Dinesh Karthik: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో దూసుకుపోతోంది. 2026, ఏప్రిల్ 5న జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను 43 పరుగుల తేడాతో ఓడించి తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన బెంగళూరు పాయింట్ల పట్టికలో మొదటిస్థానానికి చేరుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 250 పరుగులు చేయగా. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో చెన్నై 207 పరుగులకే ఆలౌట్ అయింది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోతని ఫ్యాన్స్ కళ్లారా చూశారు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ మెరుపు ఆరంభాన్ని అందివ్వగా, టిమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్ అర్ధశతకాలతో రాణించగా, కెప్టెన్ రజత్ పాటిదార్ (48) అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. 

మ్యాచ్ రసవత్తరంగా కొనసాగుతున్న సమయంలో డ్రింక్స్ బ్రేక్ వద్ద ఒక సంఘటన చోటు చేసుకుంది. రజత్ పాటిదార్, పడిక్కల్ స్టేడియంలో విశ్రాంతి తీసుకుంటుండగా, అక్కడ ఉన్న అంపైర్ అనుకోకుండా పాటిదార్‌కు చెందిన వాటర్ బాటిల్‌ను తనది అనుకుని తీసుకుని తాగాడు.. ఇది చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన పాటిదార్, వెంటనే అంపైర్ దగ్గరకు పరుగెత్తుకెళ్లి తన బాటిల్‌ను తిరిగి తీసేసుకున్నాడు. ఈ క్రమంలో మెంటర్, బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ అంపైర్‌తో గొడవ పెట్టుకోగా, హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ మాత్రం సీరియస్ గా చూస్తూ కనిపించాడు.

మ్యాచ్ తర్వాత రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శన పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్నాడు. స్టేడియంలో బ్యాటర్లు కొడుతుంటే నాన్-స్ట్రైకర్ ఎండ్ నుంచి, డగౌట్ నుంచి సిక్సర్లను చూడటం చాలా ఆనందాన్ని ఇచ్చిందని వెల్లడించాడు. బౌలర్లపై ఒత్తిడి పెంచడమే తన లక్ష్యం, జట్టు విజయం కోసం నిలకడగా ఆడటం సంతృప్తినిస్తుందని తెలిపాడు. ఏప్రిల్ 10న గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో బెంగళూరు నెక్ట్స్ మ్యాచ్ ఆడనుంది.