పీకేసిన ఒరాకిల్ ఉద్యోగానికి.. కంపెనీ ఇచ్చే డబ్బులపై ఎంత ట్యాక్స్ వేస్తారో తెలుసా..?

పీకేసిన ఒరాకిల్ ఉద్యోగానికి.. కంపెనీ ఇచ్చే డబ్బులపై ఎంత ట్యాక్స్ వేస్తారో తెలుసా..?

లేఆఫ్స్ కారణంగా జాబ్ పోగొట్టుకున్న వాళ్ల కష్టాలు మామూలుగా లేవు. ఒకపక్క జాబ్ పోయిందని బాధపడాలో లేక సెవరెన్స్ ప్యాకేజీపై కూడా టాక్స్ కట్టవలసి రావటంపై బాధపడాలో అర్థకాని పరిస్థితి. అవునండీ బాబు ఇటీవల ఒరాకిల్ లేఆఫ్స్ సందర్భంగా జాబ్ పోగొట్టుకున్న టెక్కీలు ప్రస్తుతం కొత్త జాబ్స్ కోసం వెతకటంతో పాటు వచ్చే పరిహారం సొమ్ము కాస్త టాక్స్ కోతలతో హరించుకుపోకుండా చూసుకునేందుకు తెగ తిప్పలు పడుతున్నారు. అసలు ఇండియాలో సెవరెన్స్ ప్యాకేజీపై పన్ను ఎలా విధిస్తారనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఒరాకిల్ లాంటి దిగ్గజ సంస్థలే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న వేళ ఐటీ ఉద్యోగుల్లో సెవరెన్స్ ప్యాకేజీ.. అలాగే దానిపై పడే పన్నుల గురించి భారీగా చర్చ నడుస్తోంది. ఉద్యోగం కోల్పోయిన బాధ ఒకవైపు ఉంటే.. వచ్చే అరకొర పరిహారంలో ప్రభుత్వం పన్నుల రూపంలో ఎంత కోత విధిస్తుందనే ఆందోళన మరొకవైపు వారిని వెంటాడుతోంది. భారతీయ ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం.. కంపెనీ ఇచ్చే ఈ పరిహారాన్ని జీతాలకు బదులుగా వచ్చే లాభంగా పరిగణిస్తారు. అంటే ఇది మీ సాధారణ జీతంలో భాగమే కాబట్టి.. ఉద్యోగి పన్ను పరిధిని బట్టి టాక్స్ విధించబడుతుంది.

సాధారణంగా ఒక సెవరెన్స్ ప్యాకేజీలో నోటీసు పీరియడ్ పే, లీవ్ ఎన్‍క్యాష్మెంట్, గ్రాట్యుటీ, అదనపు పరిహారం వంటివి ఉంటాయి. ఒరాకిల్ విషయాన్ని చూస్తే.. కంపెనీ లేఆఫ్ అయిన ఉద్యోగులకు ప్రతి ఏటా పూర్తి చేసిన సర్వీసుకు 15 రోజుల జీతంతో పాటు అదనంగా రెండు నెలల జీతాన్ని టాప్-అప్‌గా ఇస్తున్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇది స్వచ్ఛంద పదవీ విరమణ కాదు కాబట్టి సెక్షన్ 10(10C) కింద లభించే రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఈ లే-ఆఫ్ బాధితులకు వర్తించదు. ఈ మొత్తం నేరుగా మీ ఆదాయానికి జోడించబడి.. దానిపై సర్ఛార్జ్, సెస్‌తో కలిపి పన్ను పడుతుంది.

అయితే పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. సెక్షన్ 89 కింద లభించే ట్యాక్స్ రిలీఫ్ ఇక్కడ కీలకం. ఒకేసారి పెద్ద మొత్తంలో పరిహారం అందినప్పుడు.. ఆ ఆదాయాన్ని గత సంవత్సరాలకు విస్తరించినట్లుగా భావించి  పన్ను లెక్కిస్తారు. దీనివల్ల పన్ను శ్లాబ్ ఒక్కసారిగా పెరగకుండా కొంత రిలీఫ్ లభిస్తుంది. అలాగే గ్రాట్యుటీ విషయంలో రూ.20 లక్షల వరకు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ విషయంలో రూ.25 లక్షల వరకు కొన్ని నిబంధనలకు లోబడి మినహాయింపులు లేఆఫ్ అయిన టెక్కీలు పొందటానికి పన్ను చట్టం వీలు కల్పించింది.

చివరగా.. మీరు ఎగ్జిట్ లెటర్ సంతకం చేసే ముందు మీ సెవరెన్స్ ప్యాకేజీలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్యాకేజీలో ఏ భాగం ఎంత అనేది స్పష్టంగా ఉంటేనే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు మినహాయింపులు క్లెయిమ్ చేయడం సులభమవుతుంది. ఇక్కడ సెక్షన్ 80C, 80D వంటి పెట్టుబడుల ద్వారా కూడా కొంత పన్ను ఆదా చేయవచ్చు. ఉద్యోగం పోయిన క్లిష్ట సమయంలో ఆర్థిక క్రమశిక్షణతో పాటు.. ట్యాక్స్ ప్లానింగ్ గురించి చార్టర్డ్ అకౌంటెంట్‌ను సంప్రదించడం బెటర్. అప్పుడే చేతికి వచ్చే పరిహారం పన్ను కోరల్లో చిక్కుకోకుండా కొంతైనా ఊరట లభిస్తుంది.