ఊరమాస్ లుక్‌లో నాగశౌర్య.. ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్!

ఊరమాస్ లుక్‌లో నాగశౌర్య.. ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్!

యంగ్ హీరో నాగశౌర్య తన కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా ఒక పక్కా మాస్ అవతారంలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'బ్యాడ్ బాయ్ కార్తీక్'. రామ్ దేశిన (రమేష్) దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించారు. ఏప్రిల్ 17న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో.. లేటెస్ట్ గా చిత్ర యూనిట్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది.

ఆకట్టుకుంటున్న ట్రైలర్

ట్రైలర్ ప్రారంభంలో సీనియర్ నటుడు నరేష్ పడే ఆవేదన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. తన ప్రాంతంలో గూండాల ఆగడాల నుండి కాపాడమని దేవుడిని వేడుకునే సన్నివేశంతో కథలో తీవ్రత ఏంటో అర్థమవుతుంది. సరిగ్గా అప్పుడే 'బ్యాడ్ బాయ్ కార్తీక్'గా నాగశౌర్య ఎంట్రీ ఇస్తారు. సొంత నియమాలతో బతికే మొండి ఘటంలా, అన్యాయాన్ని ఎదిరించే ఒక అజేయ శక్తిలా ఆయన పాత్రను తీర్చిదిద్దారు. దుర్మార్గుల బారి నుండి సామాన్యులను ఆయన ఎలా కాపాడారు అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

శౌర్య మాస్ మేకోవర్

ఇప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్‌తో మెప్పించిన నాగశౌర్య, ఈ సినిమాలో ఊరమాస్ లుక్‌లో అదరగొట్టారు. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో చూపించిన వైవిధ్యం అభిమానులను ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, సీనియర్ నటుడు సాయికుమార్‌తో కలిసి చేసే కామెడీ సన్నివేశాల్లో శౌర్య టైమింగ్ అద్భుతంగా ఉంది. యాక్షన్, కామెడీల మేళవింపుతో ఈ పాత్ర చాలా ఎనర్జిటిక్ గా సాగనుంది.

తారాగణం

ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన విధి తన గ్లామర్‌తో మెప్పించగా, సముద్రఖని విలన్‌గా ఎప్పటిలాగే తన క్రూరమైన నటనతో భయపెట్టారు. నరేష్  ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే, దర్శకుడు రమేష్ కేవలం  యాక్షన్‌కే పరిమితం కాకుండా.. డ్రామా, రొమాన్స్, హ్యూమర్ వంటి అన్ని అంశాలను సమపాళ్లలో జోడించినట్లు కనిపిస్తోంది. 

పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులను ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ (Zee Studios) సొంతం చేసుకోవడం తెలుస్తోంది. వరుస విజయాల కోసం ఎదురుచూస్తున్న నాగశౌర్యకు 'బ్యాడ్ బాయ్ కార్తీక్' ఒక బలమైన మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెడుతుందేమో చూడాలి. ఏప్రిల్ 17న ఈ మాస్ జాతర థియేటర్లలో మొదలుకానుంది.