మన తెలుగు రాష్ట్రాల్లో వేసవి వచ్చిందంటే చాలు.. కొబ్బరి బోండాల స్టాల్స్ అడుగడుగునా కనిపిస్తుంటాయి. లీటర్ 100 రూపాయల నుంచి 120 రూపాయల వరకూ అమ్ముతుంటారు. హైదరాబాద్ సిటీలో అయితే.. ఏరియా ఏరియాకి ఈ రేటు మారుతుంటుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మెయిన్ రోడ్ల పక్కన బాటిల్ 150 రూపాయల దాకా కూడా అమ్ముతుంటారు. బస్తీల్లో అయితే బాటిల్ కొబ్బరి బోండాం నీళ్లు 100 రూపాయలు మినిమం అమ్ముతుంటారు.
లీటర్ అని అంటుంటారు గానీ వాస్తవానికి ఆ బాటిల్ క్వాంటిటీ లీటర్ ఉండదు. 700 ఎంఎల్ నుంచి 800 ఎంఎల్ మధ్యలో ఉంటుంది. ఇదంతా మనకు తెలిసిన ముచ్చటనే. కానీ.. బెంగళూరులో కూడా కొబ్బరి బోండాలు ఇలా బాటిళ్లలో, లీటర్స్లో అమ్ముతుంటారు. ఒక కొబ్బరి బోండాం స్టాల్ దగ్గర లీటర్ బాటిల్ 180 రూపాయలు అని కనిపించేసరికి బెంగళూరు వాసులు అవాక్కవుతున్నారు.
ఇక.. మే నెల వస్తే లీటర్ కొబ్బరి బోండాం నీళ్లు 200 రూపాయలకు అమ్మినా ఆశ్చర్యం లేదని వాపోతున్నారు. ఇంతింత రేట్లు అమ్మితే సీజనల్ బిజినెస్లో లక్షలు సంపాదించొచ్చని ఈ రేటు చూసిన నెటిజన్లు అభిప్రాయపడ్డారు. సామాన్యులు, మధ్య తరగతి జనం ఎండా కాలంలో దాహార్తిని తీర్చుకోవడానికి ఎక్కువగా కొబ్బరి బోండం నీళ్లను తాగుతుంటారు. అలాంటి సామాన్యులకు అందుబాటులో కూడా లేని విధంగా రేట్లు పెంచేసి అమ్ముతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా తర్వాత పబ్లిక్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. డాక్టర్లు చెప్పారని సీజన్తో సంబంధం లేకుండా చాలా మంది ఎక్కువగా కొబ్బరి బోండం నీళ్లను తాగుతున్నారు. డాక్టర్లు కూడా ఎండాకాలంలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి బోండం తాగాలని సూచిస్తుంటారు. కొబ్బరి నీళ్లతో శరీరం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవచ్చంటున్నారు. అలాంటి హెల్దీ డ్రింక్ ధరలు ప్రస్తుతం మండిపోతున్నాయి. డిమాండ్ఎక్కువగా ఉండడంతో సమ్మర్ సీజన్ను క్యాష్ చేసుకునేందుకు వ్యాపారులు బోండం ధరలను అమాంతం పెంచేశారు.
