రిటయిల్లోనూ  కింగ్ ​రిలయన్స్

 రిటయిల్లోనూ  కింగ్ ​రిలయన్స్
  • బెర్న్​స్టీన్​ రిపోర్టు వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా కాలంలో చేపట్టిన విస్తరణ వల్ల దేశంలోని ఆర్గనైజ్డ్​ రిటయిల్​ సెక్టార్లో కింగ్​గా మారింది. తాజాగా ఫ్యూచర్​ రిటయిల్​ స్టోర్ల టేకోవర్​తో రిలయన్స్​ రిటెయిల్​ స్టోర్లు మరింతగా పెరిగాయని బెర్న్​స్టీన్​ రిపోర్టు తెలిపింది. కరోనా కాలం నుంచి ఇప్పటిదాకా రిలయన్స్​ రిటయిల్​ తన స్టోర్ల విస్తీర్ణాన్ని  ఏకంగా 39 శాతం పెంచుకున్నట్లు ఈ రిపోర్టు వెల్లడించింది. చాలా కొత్త బ్రాండ్లను చేర్చడమే కాకుండా, డిజిటల్​ కామర్స్​లోనూ తన జోరు పెంచింది రిలయన్స్​ రిటయిల్​. 
 

రెవెన్యూలోనూ టాపే...
రెవెన్యూ, స్టోర్​ నెట్​వర్క్​ల ప్రకారం రిలయన్స్​ రిటయిల్​ ఇండియాలో అతి పెద్ద ఆర్గనైజ్డ్​ రిటయిలర్​గా మారిందని బెర్న్​స్టీన్​ తన రిపోర్టులో వివరించింది. 40 మిలియన్​ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కంపెనీకి మొత్తం 14,412 స్టోర్లు ఉన్నాయని పేర్కొంది. కిందటి అయిదేళ్లలో చూస్తే రిలయన్స్​ రిటయిల్​ రెవెన్యూ అయిదు రెట్లు పెరిగింది. రిటయిల్​ రెవెన్యూ ఒక్కటి చూసినా 18 బిలియన్​ డాలర్లను దాటింది. కాంపిటీటర్లు అందరి రెవెన్యూ కలిపినా కూడా ఇది చాలా ఎక్కువని బెర్న్​స్టీన్​ తెలిపింది. ఏటా 40 శాతం గ్రోత్​రేటు సాధించడం చాలా గొప్ప విషయమని పేర్కొంది. 
 

సక్సెస్​ఫుల్​ స్ట్రేటజీ....
ఆఫ్​లైన్​ రిటయిల్, ఆన్​లైన్​( ఈ–కామర్స్) బిజినెస్​ కోసం   ప్రత్యేకమైన స్ట్రేటజీని రిలయన్స్​ రిటయిల్​ అమలు చేస్తోందని బెర్న్​స్టీన్​ రిపోర్టు వెల్లడించింది. పోటీదారులతో పోలిస్తే మూడు రెట్ల ఎక్కువ గ్రోత్​తో ముందుందని పేర్కొంది. అన్ని కేటగిరీలలోనూ గ్రోత్​ కనబరచడం మరో విశేషమని తెలిపింది. గ్రోసరీ సెగ్మెంట్​ రెండంకెల గ్రోత్​ సాధించగా, అపారెల్​, ఎలక్ట్రానిక్స్​ సెగ్మెంట్లైతే రెండు రెట్లు పెరిగినట్లు వివరించింది. ఆన్​లైన్​ బిజినెస్​ వాటా 20 శాతం దాకా ఉంటుందని రిపోర్టు పేర్కొంది. గ్రోసరీ, కన్జూమర్​ ఎలక్ట్రానిక్స్​, అపారెల్​ సెగ్మెంట్లు చాలా పటిష్టంగా ఎదిగాయని తెలిపింది. జియో సర్వీసెస్​కు మాస్టర్​ డిస్ట్రిబ్యూటర్​గానూ రిలయన్స్​ రిటయిల్​ వ్యవహరిస్తోంది. ఈ సెగ్మెంట్లోనూ కంపెనీ దూసుకెళ్తున్నట్లు రిపోర్టు పేర్కొంది. 2022–2025 మధ్యలో రిలయన్స్​ రిటయిల్​ ఏటా 30 శాతం చొప్పున గ్రోత్​ సాధించనుందని తాము అంచనా వేస్తున్నట్లు బెర్న్​స్టీన్​ రిపోర్టు తెలిపింది. ఈ కాలంలో కంపెనీ మార్జిన్లూ మెరుగుపడతాయని పేర్కొంది.
 

జియోకి మాస్టర్​ డిస్ట్రిబ్యూటర్​....
జియో సర్వీసెస్​ అన్నింటికీ రిలయన్స్​ రిటయిలే మాస్టర్​ డిస్ట్రిబ్యూటర్​. దేశవ్యాప్తంగా 7,900 స్మాల్​ ఫార్మాట్​ జియో స్టోర్లు ఏర్పాటు చేసింది. మరో 10 లక్షలకి పైగా రిటయిల్​ పార్ట్​నర్లనూ అపాయింట్​ చేసుకుంది. దేశం మొత్తం మీద జియో స్టోర్లు 6,600 టౌన్లలో ఉన్నాయి. మొబైల్​ ఫోన్లు, టాబ్లెట్స్​, యాక్సెసరీస్​ వంటివి ఈ స్టోర్లలో అమ్ముతున్నారు. 
 

ఆన్​లైన్​ బిజినెస్​....
దేశంలోని 2 కోట్ల కిరాణాషాపులతో నెట్​వర్క్​ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉంది రిలయన్స్​ రిటయిల్​. సమీపంలోని కస్టమర్లకు ఆ షాపులే ఆర్డర్లు నెరవేర్చేలా కొత్త ప్లాన్​ను కంపెనీ తీసుకొస్తోంది. కిరాణాలను తన నెట్​వర్క్​లో చేర్చుకోవడానికి ఈ కంపెనీ మెరుగైన ఆఫర్లు ఇస్తోంది. వారికి వర్కింగ్​ క్యాపిటల్​ కోసం అప్పులు కూడా సమకూరుస్తోంది.  
 

బిగ్​ బజార్లు రిలయన్స్​ చేతికి..200 స్టోర్లను రీ‌‌‌‌‌‌బ్రాండింగ్ చేస్తున్న రిలయన్స్
కిశోర్ బియానీ చెందిన ఫ్యూచర్ రిటయిల్ స్టోర్లు రిలయన్స్ చేతికి చేరాయి. లీజుదారులకు ఫ్యూచర్​ బకాయిలు చెల్లించలేకపోవడంతో రిలయన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫ్యూచర్ రిటయిల్స్​ తన ఆపరేషన్స్ అన్నీ నిలిపివేసింది. ఫ్యూచర్‌‌లో 1,700 కంటే ఎక్కువ అవుట్‌‌లెట్‌‌లు ఉన్నప్పటికీ, రిలయన్స్ సొంతంగా 200  బిగ్ బజార్‌‌ స్టోర్లను తన పేరిట మార్చుతోంది.ఫ్యూచర్ ఉద్యోగులను తన కంపెనీలోకి తీసుకుంటోంది. ఒకప్పుడు భారతదేశపు రిటైల్ కింగ్‌‌గా పేరున్న కిషోర్ బియానీ రెండు దశాబ్దాల క్రితం బిగ్​బజార్ స్టోర్లను ప్రారంభించారు. ఫ్యూచర్ రిటయిల్ లిమిటెడ్, మన దేశంలో రెండవ అతిపెద్ద రిటయిలర్​. బకాయిలు చెల్లించలేక ఆదివారం నుంచి దుకాణాలను మూసివేసింది. ఆన్‌‌లైన్, ఆఫ్‌‌లైన్ షాపింగ్ కార్యకలాపాలను  నిలిపివేసింది. రిలయన్స్‌‌కు కూడా ఫ్యూచర్ చాలా డబ్బు చెల్లించాలి.  "తన కార్యకలాపాలను తగ్గించుకుంటున్నట్లు" ఫ్యూచర్ శనివారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలిపింది. రీబ్రాండింగ్‌‌కు ముందే రిలయన్స్ స్టాక్ టేకింగ్ చేయడంతో భారతదేశం అంతటా ఫ్యూచర్ స్టోర్లు మూతబడ్డాయి. ప్రస్తుతం స్టోర్లు 2 రోజులు పనిచేయవని బిగ్ బజార్ ట్వీట్ చేసింది.