పల్లెల్లో పెరిగిన కొనుగోలు శక్తి.. నగదు బదిలీలో తెలంగాణ భేష్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రశంసలు

పల్లెల్లో పెరిగిన కొనుగోలు శక్తి.. నగదు బదిలీలో  తెలంగాణ భేష్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రశంసలు
  • పింఛన్లు, రైతుభరోసా, పంట నష్ట పరిహారం నేరుగా ఖాతాల్లోకే బదిలీ
  • తెలంగాణ సంక్షేమ నమూనా అని 2025-26 ఆర్బీఐ వార్షిక రిపోర్ట్

 హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో మధ్యవర్తులు లేని ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిందని రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత  కీలకంగా అమలుచేస్తున్న సామాజిక పింఛన్లు,  పెట్టుబడి సాయం,  పంట నష్టపరిహారాన్ని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి (డీబీటీ) జమ చేయడం వల్ల గ్రామీణుల చేతుల్లోకి తక్షణమే నగదు అందుబాటులోకి వచ్చిందని పేర్కొంది. దీంతో ప్రజల కొనుగోలు శక్తి అనూహ్యంగా పెరిగిందని చెప్పింది. ఈ మేరకు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా 2025–26 వార్షిక నివేదికలో కీలకాంశాలను వెల్లడించింది. 

ఈ డీబీటీ సూత్రాన్ని ఇతర రాష్ట్రాలు కూడా పాటించాలని సూచించింది. ఈ వినియోగ వ్యయం మార్కెట్లలో నగదు చెలామణిని వేగవంతం చేసిందని, తద్వారా దేశవ్యాప్తంగా కరెన్సీ చెలామణిలో 11.4 శాతం గణనీయమైన రెండంకెల వృద్ధి నమోదు కావడానికి ఈ సంక్షేమ ఆధారిత నగదు బదిలీల విధానమే ప్రధాన కారణమని రిజర్వ్ బ్యాంక్ తన నివేదికలో విశ్లేషించింది. ఆర్థిక రంగానికి అవసరమైన డిమాండ్‌‌ను స్థిరంగా సృష్టిస్తూనే, పేదరిక నిర్మూలనకు తోడ్పడుతున్న ఈ ‘తెలంగాణ సంక్షేమ నమూనా’  ఆచరణీయమని తెలిపింది. 

  • ద్రవ్యలోటు నియంత్రణలో ఉత్తమ ప్రతిభ

ఆర్థిక నిర్వహణలో కఠినమైన నియమాలను పాటిస్తూ, రాష్ట్ర ద్రవ్య లోటును నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ ప్రతిభ కనబరిచిందని ఆర్బీఐ తెలిపింది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2026-–27 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర స్థూల ద్రవ్య లోటు (జీఎఫ్​డీ)ని రాష్ట్ర జీఎస్డీపీ (జీఎస్​డీపీ) లో కేవలం 3.0 శాతానికి పరిమితం చేస్తూ బడ్జెట్ అంచనాలను ప్రతిపాదించినట్లు వెల్లడించింది. దీంతో పాటు, మార్కెట్ రుణాల చెల్లింపుల కోసం ఆర్బీఐ వద్ద నిర్వహించే కన్సాలిడేటెడ్ సింకింగ్ ఫండ్ (సీఎస్​ఎఫ్​), గ్యారెంటీ రిడెంప్షన్ ఫండ్ (జీఆర్​ఎఫ్) లలో తెలంగాణ ప్రభుత్వం క్రమం తప్పకుండా పెట్టుబడులు పెడుతోందని వివరించింది. 

ఈ దీర్ఘకాలిక పొదుపు నిధులు భవిష్యత్తులో రాష్ట్ర రుణభారాన్ని తగ్గించడానికి  ప్రభుత్వ ఆర్థిక పరపతిని అంతర్జాతీయ మార్కెట్లలో నిలబెట్టడానికి ఉపయోగపడతాయని, ఆదాయ వనరులు మందగించినప్పటికీ అభివృద్ధి ప్రణాళికలు మూలధన వ్యయాల కేటాయింపులలో రాజీ పడకుండా చేసినట్టు ఆర్బీఐ రిపోర్ట్​లో విశ్లేషించింది. రాష్ట్ర ఆర్థిక అవసరాల కోసం మార్కెట్ నుంచి సేకరించే రుణాల నిర్వహణలో మరింత క్రమశిక్షణ  పారదర్శకతను తీసుకువచ్చేందుకు ఆర్బీఐ ప్రవేశపెట్టిన ‘బెంచ్ మార్క్ ఇష్యూయెన్స్ స్ట్రాటజీ’ (బీఐఎస్​) కింద ఎంపికైన 9 విశిష్ట రాష్ట్రాలలో తెలంగాణ స్థానం సంపాదించుకున్నట్టు తెలిపింది. 

ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు కానున్న ఈ వ్యూహం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం నిర్దేశిత కాలపరిమితి కలిగిన బాండ్లు  సెక్యూరిటీలను జారీ చేస్తుందని తెలిపింది. దీంతో రుణ మార్కెట్‌‌లో ప్రభుత్వ విశ్వసనీయత పెరగడమే కాకుండా, తక్కువ వడ్డీ రేట్లకే రుణ నిధులు లభించే అవకాశం ఉంటుంది. అలాగే, అత్యవసర సమయాల్లో ఆర్బీఐ అందించే 'వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్' (డబ్ల్యూఎంఏ) , ఓవర్‌‌డ్రాఫ్ట్ (ఓడీ) సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా వినియోగించుకుని, రుణ పరిమితులను ఎప్పుడూ దాటకుండా పటిష్టమైన నగదు నిర్వహణను అమలు చేస్తున్నట్టు నివేదికలో పేర్కొన్నది. 

  • గ్రామీణ వికాసానికి బాటలు..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లీడ్ బ్యాంకులు ప్రతీ జిల్లాకు ప్రత్యేక వార్షిక రుణ ప్రణాళికలను రూపొందించి, వ్యవసాయం, చేతివృత్తులు  స్థానిక పరిశ్రమలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ గ్రామీణ వికాసానికి బాటలు వేస్తున్నది. ప్రభుత్వంతో ఒకేసారి పెద్ద ఎత్తున ఈ సంక్షేమ నిధులు విడుదలయ్యే సమయాల్లో మార్కెట్‌‌లో లేదా బ్యాంకుల్లో ఎలాంటి నగదు కొరత  తలెత్తకుండా ఆర్బీఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం తనదైన పాత్ర పోషించినట్టు తెలిపింది. 

బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, గ్రామీణ బ్యాంకులకు అవసరమైన కరెన్సీ సరఫరాను సమర్థవంతంగా సమన్వయం చేసినట్టు పేర్కొంది. దీంతో ప్రజలు తమ ఖాతాల్లోని నిధులను సులువుగా విత్‌‌డ్రా చేసుకుని స్థానిక మార్కెట్లలో ఖర్చు చేయగలిగారని తెలిపింది. 

  • కరెన్సీ సరఫరాకు ఇబ్బందుల్లేవ్​

 జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (డీసీసీబీ)  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) బలోపేతానికి ఆర్బీఐ నిర్ణయాలతో క్షేత్రస్థాయిలో మార్పులు వచ్చినట్టు నివేదికలో ఆర్బీఐ  వెల్లడించింది. 'ఉత్కర్ష్ 2029' ప్రణాళికలో భాగంగా తెలంగాణ సహకార బ్యాంకులలో సైబర్ నేరాలను అరికట్టడానికి అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ మ్యాపింగ్ ప్రక్రియను  తప్పనిసరి చేయడంతో పాటు , బంగారు రుణాలపై గతంలో ఉన్న నిబంధనలను సరళీకరిస్తూ బుల్లెట్ రీపేమెంట్ సదుపాయం కల్పించామని పేర్కొంది. ఫలితంగా రైతులకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీతో రుణ లభ్యత సులువుగా మారినట్టు వివరించింది.