రూ.35 లక్షల ఉద్యోగం వస్తుందని నమ్మిచ్చి టెక్కీకి చివరి నిమిషంలో షాక్.. ఏమైందంటే?

రూ.35 లక్షల ఉద్యోగం వస్తుందని నమ్మిచ్చి టెక్కీకి చివరి నిమిషంలో షాక్.. ఏమైందంటే?

సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఓ యువ టెక్కీ కల ఒక్కసారిగా కూలిపోయింది. 6 నెలల పాటు అద్భుతంగా పనిచేసి, రూ.35 లక్షల వార్షిక వేతనంతో ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్ ఖాయమని మేనేజర్ నుంచి హామీ పొందిన అతడికి.. ఇంటర్న్‌షిప్ ముగియడానికి కేవలం 2 రోజుల ముందు ఊహించని షాక్ తగిలింది. కంపెనీ నుంచి వచ్చిన ఒక్క ఈమెయిల్ అతని కెరీర్ ప్లాన్‌ను పూర్తిగా తలకిందులు చేసేసింది.

"100 శాతం ఉద్యోగం మీదే" అన్న మేనేజర్:
టియర్-1 ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన 2026 బ్యాచ్ విద్యార్థి క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా ప్రముఖ కంపెనీలో ఇంటర్న్‌షిప్ సాధించాడు. ఇంటర్న్‌షిప్ పనితీరు ఆధారంగా రూ.35 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తామని కంపెనీ ముందే తెలిపింది. 6 నెలల పాటు మేనేజర్ కూడా అతని పనిని ప్రశంసిస్తూ "100 శాతం జాబ్ వస్తుంది" అని నమ్మకం కల్పించాడట.

చివరి క్షణంలో ఊహించని నిర్ణయం:
అయితే ఇంటర్న్‌షిప్ ముగియడానికి 2 రోజుల ముందు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కంపెనీ ఒకేసారి 90 మంది ఇంటర్న్‌లకు రిజెక్షన్ మెయిల్స్ పంపింది. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల నియామకాలను నిలిపివేస్తున్నామని, తమ పెట్టుబడులను AI వైపు మళ్లిస్తున్నామని కంపెనీ తెలిపినట్లు ఆ కుర్ర ఇంజనీర్ రెడ్డిట్ పోస్టులో పేర్కొన్నారు. దీంతో నెలల తరబడి చేసిన కష్టం ఒక్కసారిగా వృథా అయిందని వాపోయాడు.

ఒక్క ఆఫర్ మాత్రమే మిగిలింది:
కంపెనీ షాక్ ఇవ్వటంతో ఆ విద్యార్థి క్యాంపస్ ప్లేస్‌మెంట్ అవకాశాలను కూడా కోల్పోయాడు. చివరికి చేతిలో మిగిలింది యాక్సెంచర్ నుంచి వచ్చిన రూ.6.5 లక్షల ప్యాకేజీ ఆఫర్ మాత్రమే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ జీతం తాను ఇంటర్న్‌గా తీసుకున్న స్టైపెండ్ కంటే కూడా తక్కువ అని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రోగ్రామ్‌లో పాల్గొన్నప్పటికీ.. ప్రస్తుతం ఫ్రెషర్లకు ఆఫ్ క్యాంపస్ అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయని తెలిపాడు.

ALSO READ : ఇంటర్నెట్ లేకున్నా UPI పేమెంట్స్.. 

నెటిజన్ల భిన్నాభిప్రాయాలు:
ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనేక మంది స్పందించారు. కొందరు ఇటువంటి పరిస్థితులు ఐటీ రంగంలో ఇప్పుడు సాధారణమవుతున్నాయని.. కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. "ముందుగా యాక్సెంచర్ ఉద్యోగంలో చేరి ఆర్థిక భద్రత పొందు. ఉద్యోగం చేస్తూనే మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నించవచ్చు" అని మరికొందరు సలహా ఇచ్చారు.

ఐటీ ఉద్యోగ మార్కెట్‌కు హెచ్చరిక:
ఈ ఘటన ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. నేటి ఐటీ రంగంలో హామీలు మాత్రమే సరిపోవు. కంపెనీల వ్యాపార వ్యూహాలు, AI వంటి కొత్త మార్పులు నియామకాలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. అందుకే యువ టెక్కీలు ఒక్క అవకాశంపై మాత్రమే ఆధారపడకుండా, నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ ప్రత్యామ్నాయ అవకాశాలను కూడా సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.