అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ తీరంలోని మజులి ద్వీపం ఒకప్పుడు వరదలు, పర్యావరణ నాశనంతో సతమతమవుతూ ఉండేది. అలాంటి ప్రాంతాన్ని ఒక్క వ్యక్తి తన అచంచల సంకల్పంతో పచ్చని అడవిగా మార్చి ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచాడు. ఆయనే జాదవ్ మొలై పాయెంగ్. ఆయన కథ కేవలం చెట్లు నాటిన వ్యక్తి కథ కాదు. సహనం, పట్టుదల, ప్రకృతిపై ప్రేమ ఉంటే ఒకే ఒక్క మనిషి ప్రయత్నం కూడా పర్యావరణాన్ని ఎలా మార్చగలడో నిరూపించిన అద్భుతమైన స్టోరీ.
ప్రకృతిని కదిలించిన చిన్ననాటి అనుభవం:
జాదవ్ పాయెంగ్ చిన్నప్పటి నుంచే మజులి ద్వీపంలో ప్రకృతితో మమేకమై పెరిగాడు. యుక్తవయస్సులో ఒక రోజు ఎండ తీవ్రత కారణంగా చెట్లు లేని ఇసుక ప్రాంతంలో అనేక పాములు చనిపోయిన దృశ్యం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. "ప్రకృతి ఎందుకు ఇంత బలహీనంగా మారింది?" అనే ప్రశ్న ఆయన మనసులో నాటుకుపోయింది. అదే ఆయన జీవితాన్ని మార్చిన మలుపుగా నిలిచింది.
1979లో మొదలైన పచ్చని ప్రయాణం:
1979లో పాయెంగ్ స్వయంగా మొక్కలు నాటడం ప్రారంభించాడు. ఎలాంటి ప్రభుత్వ సహాయం లేకుండా, ప్రచారం లేకుండా ప్రతి రోజు చిన్న మొక్కలను నాటి వాటికి నీరు పోస్తూ, సంరక్షిస్తూ ముందుకు సాగాడు. మొదట్లో అవి కొన్ని వెదురు మొక్కలు, చిన్న చిన్న చెట్లే. కానీ సంవత్సరాలు గడిచేకొద్దీ అవి పెరిగి ఒక పెద్ద అటవీ వ్యవస్థగా రూపుదిద్దుకున్నాయి. ప్రకృతే మిగతా పనిని పూర్తి చేస్తూ కొత్త మొక్కలు సహజంగా పెరిగే పరిస్థితిని సృష్టించింది. దీంతో మెుత్తం 40 ఏళ్లలో 1300 ఎకరాల పచ్చని అటవి తయారైంది.
వేల హెక్టార్లలో విస్తరించిన మొలై అడవి:
దశాబ్దాల నిరంతర కృషితో ఏర్పడిన ఈ అడవి ఇప్పుడు "మొలై ఫారెస్ట్"గా ప్రసిద్ధి చెందింది. వేల హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ అరణ్యంలో అనేక రకాల చెట్లు, పక్షులు, జింకలు, ఖడ్గమృగాలు వంటి అడవి జంతువులు నివసిస్తున్నాయి. ప్రతి ఏడాది ఏనుగుల గుంపులు కూడా ఈ అడవిని సందర్శిస్తుంటాయి. ఈ అడవి భూక్షయాన్ని తగ్గించడమే కాకుండా జీవవైవిధ్యాన్ని కాపాడే సహజ ఆశ్రయంగా మారింది.
ALSO READ : మళ్లీ పెరిగిన గోల్డ్ రేటు.. ఇప్పట్లో ఆగదా..
ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన "ఫారెస్ట్ మ్యాన్":
పాయెంగ్ చేసిన సేవ చాలా సంవత్సరాల పాటు ప్రపంచానికి తెలియలేదు. 2007లో ఫోటోగ్రాఫర్, జర్నలిస్టు జితు కలితా ఈ అడవిని గుర్తించడంతో ఆయన కృషి వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి జాదవ్ పాయెంగ్ "భారతదేశ ఫారెస్ట్ మ్యాన్"గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించగా, పర్యావరణ పరిరక్షణపై అంతర్జాతీయ వేదికల్లో ప్రసంగించే అవకాశం కూడా దక్కింది.
సహనానికి చిరస్మరణీయ నిదర్శనం:
జాదవ్ పాయెంగ్ సాధించిన విజయం ఒక్కరోజులో సాధ్యమైనదైతే అస్సలు కాదు. దశాబ్దాల పాటు నమ్మకంతో, ఓర్పుతో చేసిన కృషి ఫలితమే మొలై అడవి. ప్రకృతిని ప్రేమిస్తే, చిన్న ప్రయత్నం కూడా భవిష్యత్తులో మహత్తర మార్పును తీసుకురాగలదని ఆయన నిరూపించారు. నేటికీ ఆయన స్టోరీ ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలకు స్ఫూర్తిగా నిలుస్తూ.. భవిష్యత్ తరాలకు పచ్చని భూమిని అందించాలనే సందేశాన్ని చాటిచెబుతోంది.
