ఉద్యోగులకు HDFC బ్యాంక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్.. వారంలో ఎన్ని రోజులంటే..?

ఉద్యోగులకు HDFC బ్యాంక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్.. వారంలో ఎన్ని రోజులంటే..?

సాంప్రదాయ బ్యాంకింగ్ రంగంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త మార్పునకు శ్రీకారం చుడుతున్నాయి దేశంలోని ప్రైవేటు బ్యాంకులు. ఈ క్రమంలోనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మోడీ పిలుపు మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ, స్టార్టప్ కంపెనీల్లో సర్వసాధారణమైన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తమ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని హెచ్‌డీఎఫ్‌సీ నిర్ణయించింది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. దీంతో ఇంధన పొదుపు పాటించి ఫారెక్స్ రిజర్వ్స్ కాపాడాలంటూ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ హైబ్రిడ్ వర్క్ విధానాన్ని ప్రాథమికంగా ఒక నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా అర్హులైన ఉద్యోగులు వారానికి 2 రోజుల పాటు ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ ట్రయల్ పీరియడ్ గనుక విజయవంతమైతే.. దీనిని మరింత కాలం పొడిగించే అవకాశం ఉందని సమాచారం. అంతేకాదు ఆఫీసుల్లో జరిగే అంతర్గత సమావేశాలను కూడా వీలైనంత వరకు వర్చువల్ పద్ధతిలోనే నిర్వహించాలని బ్యాంక్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు బ్యాంక్ లోని ఉద్యోగులందరికీ వర్తించదు. కేవలం కస్టమర్లతో నేరుగా సంబంధం లేని డిపార్ట్మెంట్ ఉద్యోగులకు మాత్రమే దీనిని పరిమితం చేశారు. బిజినెస్ ఎనేబ్లింగ్, కార్పొరేట్ ఎనేబ్లింగ్ ఫంక్షన్స్‌లో ఉండే ఐటీ, ఫైనాన్స్, ఆపరేషన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, కాంప్లయన్స్ వంటి విభాగాల సిబ్బందికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని బ్యాంక్ అధికారిక ప్రతినిధి స్పష్టం చేశారు. కస్టమర్లతో నేరుగా వ్యవహరించే బ్యాంక్ బ్రాంచ్‌లు, ఇతర ఫ్రంట్-ఆఫీస్ సేవలు ఎప్పటిలాగే యథాతథంగా కొనసాగుతాయి.

నిజానికి బ్యాంకింగ్ రంగం చాలా సాంప్రదాయకమైనది. కోవిడ్ మహమ్మారి తగ్గిన తర్వాత దాదాపు అన్ని బ్యాంకులు తమ ఉద్యోగులను ఆఫీసులకే రప్పించాయి. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ దారిలోనే హెచ్‌డీఎఫ్‌సీ కూడా లిస్టులో చేరింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఇటీవలే తమ మార్కెటింగ్, హెచ్ఆర్, టెక్నాలజీ విభాగాలకు హైబ్రిడ్ మోడల్ ప్రవేశపెట్టగా.. యాక్సిస్ బ్యాంక్ కరోనా సమయం నుంచే దీనిని కొనసాగిస్తోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు, ఉద్యోగుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని హెచ్‌డీఎఫ్‌సీ తీసుకున్న ఈ నిర్ణయం బ్యాంకింగ్ రంగంలోనూ ఒక సరికొత్త మార్పునకు దారి తీసేలా కనిపిస్తోంది.