రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతం.. పెట్రోల్‌‌, డీజిల్ ధరలు పెంచకపోవడంతో ఇంకా కంట్రోల్లోనే..

రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతం.. పెట్రోల్‌‌, డీజిల్ ధరలు పెంచకపోవడంతో ఇంకా కంట్రోల్లోనే..

న్యూఢిల్లీ: భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఏప్రిల్‌‌లో 3.48 శాతంగా రికార్డయింది.   మార్చిలో ఇది  3.40 శాతంగా,  ఫిబ్రవరిలో 3.21 శాతంగా నమోదైంది. గ్లోబల్‌‌గా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నా ఇండియాలో పెట్రోల్‌‌, డీజిల్ ధరలు పెరగకపోవడంతో ద్రవ్యోల్బణం ఇంకా కంట్రోల్లోనే ఉంది. 

ఈసారి రిటైల్ ద్రవ్యోల్బణం (కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ)) స్వల్పంగా పెరగడానికి ప్రధాన కారణం   ఆహార ధరలు పెరగడమే.  కిందటి నెలలో   ఆహార ద్రవ్యోల్బణం 4.20శాతానికి చేరింది. మార్చిలో ఇది 3.87శాతంగా ఉంది.  టొమాటో ధరలు ఏడాది లెక్కన  ఏప్రిల్‌‌లో 35.28శాతం పెరగగా, బంగాళదుంపలు ధరలు  23.69శాతం, ఉల్లిపాయల ధరలు -17.67శాతం తగ్గాయి.

కన్జూమర్లపై రూపాయి భారం
క్రూడాయిల్ ధరలు పెరగడంతో రూపాయి బలహీనపడుతోంది. దీంతో ఇండియా దిగుమతులు ఖరీదుగా మారాయి. ఈ ప్రభావం రానున్న నెలల్లో కనిపించనుంది.  ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి  రూపాయి విలువ దాదాపు 5శాతం తగ్గింది.  మంగళవారం  రికార్డు స్థాయిలో 95.76కి చేరింది.

ఆర్‌‌బీఐ వైఖరి..
 ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆర్‌‌బీఐ నిర్దేశించిన 2-6 శాతం పరిధిలోనే ఉన్నప్పటికీ, ఇంధన ధరలు పెరిగితే అక్టోబర్ నుంచి వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం కొత్త వినియోగ బాస్కెట్, కొత్త బేస్ ఇయర్‌‌తో (2026) ద్రవ్యోల్బణ గణాంకాలను లెక్కిస్తున్నారు.