ఆకట్టుకుంటున్న "గ్రీన్ హౌస్"

ఆకట్టుకుంటున్న "గ్రీన్ హౌస్"

ఉత్తరప్రదేశ్లోని షాగంజ్ పట్టణానికి దేశ, విదేశాల పర్యాటకులు కూడా వెళ్తుంటారు. అలా అని అక్కడేదో చారిత్రక కట్టడం ఉందని అనుకోకండి. ఆ పర్యాటకులంతా వెళ్లేది ఓ సాదాసీదా వ్యక్తి ఇంటికి. ఆ ఇంట్లో ఉన్న అతిపెద్ద గార్డెన్ ను చూడటానికి విదేశీ టూరిస్టులు  సైతం క్యూ కడుతుంటారు. ఆ గార్డెన్లో  400 విభిన్న రకాలకు చెందిన 1000కుపైగా మొక్కలు ఉన్నాయి. దాదాపు 6,300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని  గార్డెన్తో పచ్చగా కళకళలాడే ఈ ఇంటిని పర్యాటకులు ‘గ్రీన్ హౌస్’ అని పిలుస్తారు.  టూరిస్టులు షాగంజ్ కు వెళ్లి ‘గ్రీన్ హౌస్’ అని చెబితే..  రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రశేఖర్ శర్మ ఇంటిని స్థానికులు చూపిస్తారు. ఆగ్రా ప్రాంతంలో ఎక్కడా కనిపించని తామర పువ్వులను కూడా ఈ గార్డెన్ లో మనం చూడొచ్చు.  

‘గ్రీన్ హౌస్’ను చూసి స్ఫూర్తి పొందిన ఎంతోమంది పరిసర ప్రాంతాల ప్రజలు కూడా తమ ఇళ్లలో గార్డెనింగ్ ను మొదలుపెట్టారు. ఇందుకోసం చంద్రశేఖర్ శర్మ  నుంచి విలువైన సలహాలు, సూచనలు తీసుకున్నారు.  గత రెండేళ్లలో ఈవిధంగా దాదాపు 50 మంది షాగంజ్ పట్టణవాసులు తమ ఇంటి ప్రాంగణాల్లో గార్డెనింగ్ కు శ్రీకారం చుట్టారు.  చంద్రశేఖర్ శర్మ  మాట్లాడుతూ.. ‘‘మా ఇల్లు 300 ఏళ్ల పాతది.  నేను స్వయంగా మా ఇంట్లో ఇప్పటిదాకా వేలాది మొక్కలను నాటాను. మరో ఏడాదిలోగా ఇంకో 500కిపైగా మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ మొక్కలతో నేను ఎమోషనల్ గా అటాచ్ అయి ఉన్నాను. వాటిని నా పిల్లల్లా చూసుకుంటా’’ అని వివరించారు.  ఇంకో విషయం ఏమిటంటే.. షా గంజ్ పట్టణ  సగటు ఉష్ణోగ్రత కంటే చంద్రశేఖర్ శర్మ  ఇల్లు ‘గ్రీన్ హౌస్’ లో దాదాపు 45డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇదంతా వేలాది మొక్కల చలువేనని నిస్సందేహంగా చెప్పొచ్చు.  ఈ ఇంట్లో గాలి నాణ్యత సూచీ కూడా ఎంతో అత్యుత్తమంగా ‘25’కు దరిదాపుల్లో ఉంటుంది. అంటే స్వచ్ఛమైన గాలికి నిలయంగా గ్రీన్ హౌస్ మారింది. 

మొక్కల పెంపకం ఇలా.. 

చంద్రశేఖర్ శర్మ  ఇంటి పెరటిలోని మొక్కలకు నీటిని అందించేందుకు డ్రిప్ సిస్టమ్ అందుబాటులో లేదు. దీంతో ఆయన స్వయంగా మొఘల్, జపనీస్ సాగునీటి పంపిణీ పద్ధతుల గురించి తెలుసుకున్నారు.  తోటమాలీలతో కలిసి శర్మ కూడా రోజూ మొక్కలకు తొట్టెల ద్వారా నీళ్లు పోస్తుంటారు. ఈ ఇంట్లో చాలా వరకు నిలువుగా ఉండే గోడలపై పాకే మొక్కలను సైతం పెంచుతున్నారు చంద్రశేఖర్ శర్మ. ఉదయం లేవగానే పక్షుల కిలకిలరావాలతో  రోజు మొదలవుతుందని ఆయన భార్య నీలం కూడా ఈ సందర్భంగా తెలిపారు.