‘సిగ్నల్ ఫ్రీ’ సిటీయే లక్ష్యం..ట్రాఫిక్ నిర్వహణ.. రోడ్డు భద్రత పర్యవేక్షణ బ్యూరో ఏర్పాటు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి 

‘సిగ్నల్ ఫ్రీ’ సిటీయే లక్ష్యం..ట్రాఫిక్ నిర్వహణ.. రోడ్డు భద్రత పర్యవేక్షణ బ్యూరో ఏర్పాటు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి 
  • ఓఆర్ఆర్ పై ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో పెరుగుతున్న వాహనాల రద్దీకి చెక్ పెడుతూ, పటిష్టమైన రోడ్డు భద్రతను పెంపొందించేందుకు గాను ప్రత్యేకంగా ‘ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణ బ్యూరో'ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలో రోడ్డు రవాణా సంస్కరణలు, ప్రమాదాల నివారణపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేవలం తాత్కాలిక నిబంధనలను కఠినంగా అమలు చేయడం కంటే, వాహనాల రాకపోకల ట్రాఫిక్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ పైనే పోలీస్, రవాణా విభాగాలు ఎక్కువ దృష్టి సారించాలని సూచించారు. కొత్తగా ప్రతిపాదించే ఈ ప్రత్యేక బ్యూరో సంస్థాగత నిర్మాణం పక్కాగా ఉండాలని, దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే తుది ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకుంటున్న చర్యలు, వాటి ఫలితాలపై ప్రతి రెండు లేదా మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.  

ప్రమాదాల అడ్డుకట్టకు ప్రత్యేక చర్యలు..

వాహనాలు వేగంగా, సురక్షితంగా సాగిపోయేలా 'సిగ్నల్ ఫ్రీ' వ్యవస్థను తీసుకురావడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని సీఎం వివరించారు. అందుకోసం రద్దీ ఎక్కువగా ఉండే కీలక కూడళ్ల వద్ద నిలిచిపోకుండా నిరంతరం మూవ్‌‌‌‌‌‌‌‌మెంట్ ఉండేలా చూడాలని, అవసరమైన ప్రాంతాల్లో అండర్ పాస్‌‌‌‌‌‌‌‌లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అలాగే, ఔటర్ రింగ్ రోడ్డుపై జరుగుతున్న వరుస ప్రమాదాలను తీవ్రంగా పరిగణించిన సీఎం, అక్కడ ప్రమాదాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ పై ఎక్కడపడితే అక్కడ అడ్డదిడ్డంగా వాహనాలు, లారీలను నిలపకుండా ప్రత్యేక బృందాలతో నిరంతరం పెట్రోలింగ్ చేపట్టాలని సూచించారు.  ఈ సమీక్ష సమావేశంలో పురపాలక, పోలీస్, రవాణా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.