పెరిగిన భూముల విలువలు ఇవాళ్టి ( జూన్ 5) నుంచి అమల్లోకి

పెరిగిన భూముల విలువలు ఇవాళ్టి ( జూన్ 5) నుంచి అమల్లోకి
  •     కొత్త మార్కెట్ విలువలతో సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ రెడీ
  •     రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి పెంపు
  •     ఖజానాకు రూ.1,400 కోట్ల అదనపు రాబడి అంచనా

హైదరాబాద్​, వెలుగు:  రాష్ట్రవ్యాప్తంగా సవరించిన భూముల మార్కెట్ విలువలు శుక్రవారం (ఇయ్యాల్టి) నుంచే  అమలులోకి రానున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో భూముల ప్రభుత్వ విలువలను పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 వేల ప్రాంతాల్లో ఈ పెంపు చేశారు.  ఈ సవరించిన విలువల ద్వారా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు అదనంగా మరో రూ.1,400 కోట్ల భారీ రాబడి సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఇందుకు సంబంధించిన సాంకేతిక మార్పుల కోసం గురువారం అర్ధరాత్రి నుంచే రిజిస్ట్రేషన్ సర్వర్లను పూర్తిగా నిలిపివేసి, శుక్రవారం ఉదయానికల్లా సరికొత్త మార్కెట్ విలువలతో సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ అప్‌‌‌‌డేట్ చేసి ఆన్ చేయనున్నారు. 

దీంతో ఇయ్యాల్టి నుంచి భూములు, ప్లాట్లు, ఇండ్ల రిజిస్ట్రేషన్లు చేయించుకునే వారికి పెరిగిన భారంతో కూడిన కొత్త ధరలు స్వాగతం పలకనున్నాయి. ఉమ్మడి ఏపీలో చివరిసారిగా 2013లో భూముల మార్కెట్ విలువలను సవరించారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా దాదాపు ఎనిమిదేళ్ల పాటు పాత ధరలే కొనసాగాయి. అయితే, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోవడం, ప్రభుత్వ ఆదాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం రావడంతో.. మొదటిసారిగా 2021 జూలైలో మార్కెట్ విలువలను భారీగా సవరించారు. ఆ పెంపుదల మరువక ముందే, కేవలం ఆరు నెలల వ్యవధిలోనే.. అంటే 2022 ఫిబ్రవరిలో రెండోసారి భూముల ధరలను పెంచుతూ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తాజాగా ఇప్పుడు మూడోసారి దాదాపు 8 వేల ప్రాంతాల్లో మార్కెట్ విలువలను సవరించడం ద్వారా రియల్ ఎస్టేట్ మార్కెట్ శరవేగంగా విస్తరించిన ప్రాంతాల్లో ప్రభుత్వ ధరలను కూడా ఓపెన్ మార్కెట్ రేట్లకు అనుగుణంగా మార్చే ప్రయత్నం చేశారు.

 గత రెండు పెంపులతో పోలిస్తే ఈసారి క్షేత్రస్థాయి డిమాండ్, హైవేల విస్తరణ, ఐటీ కారిడార్ల వృద్ధిని మేరకు శాస్త్రీయంగా ధరలను సవరించారు. తాజా సవరణల ప్రకారం ప్రాంతాల వారీగా కనిష్ట, గరిష్ట ధరలను పరిశీలిస్తే రియల్ ఎస్టేట్ గమ్యస్థానాలు స్పష్టమవుతున్నాయి. క్యూర్ పరిధిలో చదరపు గజం కనిష్ట ధర రూ.3 వేలుగా నిర్ణయించగా, హెచ్ఎండీఏ పరిధిలో రూ.2 వేలు, మున్సిపాలిటీల పరిధిలో కనిష్టంగా రూ.1,500గా ఖరారు చేశారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఒకలా, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో మరోలా ధరలను హేతుబద్ధీకరించారు. ఉదాహరణకు రాష్ట్రంలోనే అత్యంత తక్కువగా ములుగు జిల్లాలో వ్యవసాయ భూములు  ఎకరా కనీస ధర రూ.2.75 లక్షలుగా ఉంది. 

గరిష్టంగా శేరిలింగంపల్లి ఖజాగూడలో ఎకరా   30 కోట్లుగా మార్కెట్​ వాల్యూ ఉంది. అదే సమయంలో గరిష్ట ధరల్లో హైదరాబాద్‌‌‌‌లోని జూబ్లీహిల్స్ అగ్రస్థానంలో నిలిచింది. జూబ్లీహిల్స్‌‌‌‌లో చదరపు గజం గరిష్ట ధర ఏకంగా రూ.1.16 లక్షలకు చేరగా, ఐటీ హబ్ గచ్చిబౌలిలో రెసిడెన్షియల్ ఏరియాలో చదరపు గజం ధర రూ.78,600గా నిర్ణయించారు. ఇక అపార్ట్‌‌‌‌మెంట్ల కోసం చదరపు అడుగు (ఎస్ఎఫ్​టీ) కనిష్ట ధరను రాష్ట్రవ్యాప్తంగా రూ.1,000గా ప్రామాణిక యూనిట్‌‌‌‌గా తీసుకోగా, విలాసవంతమైన బంజారాహిల్స్ మెయిన్ రోడ్డులో చదరపు అడుగు ధర గరిష్టంగా రూ.8,400కు చేరుకుంది. ఈ సవరణల వల్ల ఓపెన్ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ ధరలకు మధ్య వ్యత్యాసం తగ్గి, సామాన్య, మధ్యతరగతి వర్గాలపై రిజిస్ట్రేషన్ల భారం గణనీయంగా పెరగనుంది.