సిద్దిపేట చుట్టూ రింగ్​ పైపులైన్​ : హరీశ్

సిద్దిపేట చుట్టూ రింగ్​ పైపులైన్​ : హరీశ్

సిద్దిపేట, వెలుగు:  సిద్దిపేట ప్రజల అవసరాలకు అనుగుణంగా మిషన్ భగీరథలో భాగంగా పట్టణం చుట్టూ రింగ్​ పైపులైన్​ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.  మంగళవారం సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని  కాళ్లకుంట కాలనీలో రింగ్ మెయిన్ పైప్ లైన్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శుద్ధమైన తాగునీటి  కోసం సిద్దిపేట పట్టణం చుట్టూ 18 కిలోమీటర్ల మేర రూ.32 కోట్లతో రింగ్ మెయిన్ పైప్​లైన్​ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఒకరోజు  సిద్దిపేట ప్రజలకు 25 ఎంఎల్డీ తాగునీరు అవసరం అవుతుండగా, 2048 నాటికి  42 ఎంఎల్డీ లకు చేరే అవకాశం ఉండటంతో రానున్న 50 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా దీనికి శ్రీకారం చుట్టామని చెప్పారు. కాళ్లకుంట కాలనీ అభివృద్ధి కోసం రూ.1 కోటి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులను ప్రారంభించారు.

భూ సార లోపం ఆరోగ్యాలపై ప్రభావం

భూసారం లోపిస్తే అది క్రమంగా మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నందున కెమికల్ ఫర్టిలైజర్ వాడాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి హరీశ్​రావు అన్నారు. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో  భూమిత్ర సేంద్రియ ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి పలు సూచనలు చేశారు. సిద్దిపేట పట్టణంలోని తడి చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చి రైతులకు అందజేస్తున్నామని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా తన వ్యవసాయ  క్షేత్రం కోసం 125 బస్తాల సేంద్రియ ఎరువును మంత్రి హరీశ్​ రావు కొనుగోలు చేశారు.  కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు, కమిషనర్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. 

నచ్చిన రంగంలో  రాణించాలి

సిద్దిపేట టౌన్, వెలుగు : విద్యార్థులు మంచిగా చదువుకొని నచ్చిన రంగంలో రాణించాలని మంత్రి హరీశ్​రావు సూచించారు. మంగళవారం పట్టణంలోని ఇందిరానగర్ జడ్పీ హై స్కూల్ ను ఇంగ్లీష్ ఆండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా దత్తత తీసుకునే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీ స్టడీ సర్కిల్ కొత్త భవనానికి, కోటిలింగాల ఆలయ ప్రాంగణంలో రూ.50లక్షలతో నిర్మించే ద్యాన మందిరానికి, డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్మించే అదనపు తరగతి గదులకు, పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. వడ్ల కొనుగోలుదారులకు క్యాంపు కార్యాలయంలో చెక్కులను అందజేశారు. 

నాడు కంటతడి... నేడు పంటతడి

దుబ్బాక, వెలుగు: ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి రోజు రైతుల్లో కంటతడి ఉండేదని, స్వరాష్ట్రంలో పంటతడి ఉంటుందని, పొలం వాకిట్లోకి సాగు నీరు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్​దేనని మంత్రి హరీశ్​రావు అన్నారు.  మంగళవారం దుబ్బాక మండలం నర్లెండ్ల గడ్డ గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఉమ్మడి రాష్ట్రంలో బోర్లు వేస్తే చుక్క నీరు రాని పరిస్థితి ఉండేదని, స్వరాష్ట్రంలో కాళేశ్వరం​తో గ్రామాల్లో వాగులు, కాల్వలు నీటితో నిండుకున్నాయన్నారు.