మూసీ నదిలో పెరుగుతున్న వరద ఉధృతి

మూసీ నదిలో పెరుగుతున్న వరద ఉధృతి

నల్లగొండ జిల్లా: అడపా.. దడపా కురుస్తున్న వర్షాలకు మూసీ నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా మూసీ ప్రాజెక్టు నీటిమట్టం కూడా పెరుగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో మూడు గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల ప్రారంభించారు. 
మూసీ నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండడం.. మరో వైపు ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో మూడు గేట్లు అడుగు మేర ఎత్తి నీటి విడుదల ప్రారంభించడంతో   ప్రాజెక్టు ఆయకట్టు.. కాల్వల కింద సాగు చేసే రైతులను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ప్రస్తుతం మూసీ ప్రాజెక్టు వద్ద మూడు గేట్లు(3,7,10 నంబర్లు) అడుగు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. మూసీ నదిలో వరద ప్రవాహం (ఇన్ ఫ్లో) 1247.79 క్యూసెక్కులు ఉండగా.. మూడు గేట్ల ద్వారా 1992.74 క్యూసెక్కులు విడుదల ( అవుట్ ఫ్లో) చేస్తున్నారు. 
మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 644.61 అడుగులకు చేరుకుంది. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా..  4.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో పైనుంచి వచ్చిన వరద ప్రవాహాన్ని వచ్చినట్ల దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.