సీఎం నితీష్ కుమార్ అలసిపోయారు.. రాష్ట్రాన్ని హ్యాండిల్ చేయలేరు

సీఎం నితీష్ కుమార్ అలసిపోయారు.. రాష్ట్రాన్ని హ్యాండిల్ చేయలేరు

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. జనతాదళ్ (యునైటెడ్) చీఫ్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ అలసిపోయారని, రాష్ట్రాన్ని హ్యాండిల్ చేయలేరని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజశ్వీ యాదవ్ విమర్శించారు. అభివృద్ధి, నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, పేదరికం వంటి అంశాలపై మాట్లాడటానికి నితీష్ కుమార్ ఇష్టపడటంలేదని తేజశ్వీ యాదవ్ అన్నారు.

‘బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అలసిపోయారు. ఆయన రాష్ట్రాన్ని పాలించలేరు. అభివృద్ధి, నిరుద్యోగం, విద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాలు మరియు పేదరికం గురించి మాట్లాడటానికి ఆయన ఇష్టపడరు. బీహార్‌కు ఏ సముద్రంతోనూ అనుసంధానం లేకపోవడం వల్ల పరిశ్రమలు ఏర్పాటు చేసి.. ఉద్యోగ కల్పన చేయలేమని అన్నారు’ అని యాదవ్ మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

రఘోపూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మేం మా వాగ్దానాలను నెరవేరుస్తాము. మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. బీహార్ ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటారని మేం ఆశిస్తున్నాం’ అని ఆయన అన్నారు. బీహార్‌లో ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు కలిసి ఆర్జెడీ నాయకత్వంలో ‘మహాగత్బంధన్’(గ్రాండ్ అలయన్స్)గా ఏర్పడ్డాయి.

ఇప్పటికే సీఎం నితీష్ కుమార్ నాలుగు ప్రచార ర్యాలీలు నిర్వహించి ప్రత్యర్థి ఆర్జెడీపై మాటల దాడి చేశారు. ఆర్జెడీకి రాజకీయాలు ఒక వ్యాపార సాధనమని.. కానీ తమకు మాత్రం ప్రజలకు సేవ చేసే సాధనమని ఆయన అన్నారు. ఎన్‌డీఏ హయాంలోని జంగిల్ రాజ్ ప్రభుత్వాన్ని కూలదోసి.. రాష్ట్రంలో తాము 2005లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన నొక్కి చెప్పారు. నితీష్ కుమార్ తన ప్రచారంలో భాగంగా.. 15 సంవత్సరాల తమ పాలనను మరియు ఆర్జెడీ పాలనను పోల్చుకోవాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నాడు.

బీహార్‌లో 243 అసెంబ్లీ సీట్లకు గాను మూడు దశల్లో ఓటింగ్ జరగనుంది. అక్టోబర్ 28, నవంబర్ 3, మరియు నవంబర్ 7 తేదీలలో ఎన్నికలు జరుగుతాయి. వీటి ఫలితాలు నవంబర్ 10న ప్రకటించబడతాయి.

For More News..

కరోనాను కంట్రోల్ చేయడంలో భారత్ కంటే పాకిస్తాన్ బెటర్

కరోనాతో బీహార్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి మృతి

మాజీ హోంమంత్రి నాయిని ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స