షూరిటీలతో బయటికొచ్చినోళ్లు గ్యారంటీలిస్తే నమ్మాలా?

షూరిటీలతో బయటికొచ్చినోళ్లు గ్యారంటీలిస్తే నమ్మాలా?
  • ఇండియా కూటమి నేతలపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఫైర్

న్యూఢిల్లీ, వెలుగు: ఇండియా కూటమిలోని పలువురు నేతలు స్కాములతో జైలుకెళ్లి, బెయిల్ మీద షూరిటీలతో బయటకు వచ్చారని బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. అలాంటి వారు గ్యారంటీలు ఇస్తే నమ్మాలా అని ప్రశ్నించారు. ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదురుగా ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమిలోని అవినీతిపరులే  లోక్ సభ ఎన్నికల్లో స్టార్ క్యాంపెనర్లుగా ఉన్నారని విమర్శించారు. షూరిటీల మీద జైలు నుంచి బయటకు వచ్చిన వారు అనేక అంశాలపై గ్యారంటీలు ఇస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

 ఢిల్లీ లిక్కర్ కేసును ఈడీ పారదర్శకంగా విచారిస్తున్నదని తెలిపారు. అది ముమ్మాటికి స్కామేనని, పాలసీ కాదని వెల్లడించారు. మద్యం అమ్మకాల్లో కొన్ని సంస్థలకే మేలు జరిగేలా  ఢిల్లీ సర్కార్ విధివిధానాలను రూపొందించిందని ఆరోపించారు. కల్వకుంట్ల కవిత అరెస్ట్ విషయంలో తప్పుడు ఆరోపణలను ఖండిస్తున్నట్లు చెప్పారు. క్విడ్ ప్రోకోకు పాల్పడిన ఈ కేసు విచారణలో త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా జరిగిన 4 ఫేజుల్లో బీజేపీ వైపు ప్రజలు నిలిచారని... మిగిలిన 3 ఫేజుల్లోనూ కమలం పార్టీకి మద్దతు కొనసాగుందని ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు