
ముంగారి, ప్రయాగ్‌రాజ్, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లో ఈసారి బీజేపీకి దక్కేది కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమేనని కాంగ్రెస్ మాజీ చీఫ్, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం ఇండియా కూటమి తరఫున రాహుల్ యూపీలోని ప్రయాగ్ రాజ్, ముంగారి, ఢిల్లీలలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొన్నారు. ముంగారిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఒక్క సీటులో మాత్రమే విజయం సాధిస్తుందన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై బీజేపీ, ఆరెస్సెస్ దాడిచేస్తున్నాయని, వాటిని కాపాడుకునేందుకే ఈ ఎన్నికలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని, తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ‘‘మేము అధికారంలోకి వస్తే ఎంఎస్పీ కోసం చట్టం చేస్తాం. నిరుద్యోగులకు ఆర్థికంగా అండగా ఉంటాం. అగ్నివీర్ స్కీంను చెత్తబుట్టలోకి పారేస్తాం.
గతంలో జరిగినట్లే
సాయుధ బలగాల రిక్రూట్మెంట్ చేపడతాం” అని రాహుల్ హామీ ఇచ్చారు. ప్రయాగ్‌రాజ్ ర్యాలీ నుంచి మధ్యలోనే.. ప్రయాగ్‌రాజ్ ర్యాలీలో పార్టీ కార్యకర్తలు రాహుల్‌ను దగ్గరి నుంచి చూడాలని ముందుకు తోసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు నేతలకు సూచించారు. కార్యకర్తల అభిమానం ప్రమాదానికి కారణం కావొద్దనే ఆలోచనతో, సెక్యూరిటీ సిబ్బంది సూచనలతో రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ ర్యాలీ మధ్యలో నుంచే వెళ్లిపోయారు. ఆదివారం ప్రయాగ్ రాజ్ లోని ఫుల్పూర్ పార్లమెంటు నియోజకవర్గంలోని పడీలాలో పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాహుల్, అఖిలేశ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారిని దగ్గరి నుంచి చూడాలని కార్యకర్తలు వేదిక వైపు వెళ్లారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను పక్కకు తోసేశారు. పోలీసులు, భద్రతా సిబ్బంది వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. దీంతో కార్యకర్తలకు సర్దిచెప్పి రాహుల్, అఖిలేశ్ ఇద్దరూ అక్కడి నుంచి మరో ర్యాలీకి బయలుదేరారు. ప్రయాగ్ రాజ్ జిల్లాలోనే అలహాబాద్ పార్లమెంటు సీటు పరిధిలోకి వచ్చే ముంగారికి చేరుకున్నారు. అక్కడ కూడా వారికి అదే పరిస్థితి ఎదురైంది. వారిని చూసేందుకు ఇరు పార్టీల కార్యకర్తలు.. బారికేడ్లు దాటుకుని వేదిక వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు జోక్యం చేసుకొని కార్యకర్తలను అడ్డుకుని, అందరినీ వెనక్కి జరిపారు.
నేను ఆప్‌కు ఓటేస్తా: రాహుల్
ఢిల్లీలో తాను ఆప్ అభ్యర్థికి ఓటేస్తానని, అర్వింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తారని రాహుల్ గాంధీ తెలిపారు. రెండు పార్టీల మధ్య బలమైన బంధానికి సూచనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లలో విజయం సాధించడానికి కాంగ్రెస్, ఆప్ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. దేశంలోని సమస్యలపై తనతో చర్చించేందుకు ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా రాహుల్ సవాల్ విసిరారు. ‘‘ప్రధాని ఎక్కడ కోరుకుంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు చర్చించడానికి నేను రెడీ. కానీ, ఆయనే నాతో చర్చించడానికి ముందుకు రారు. ఒకవేళ ఆయన వస్తే.. ఆశ్రిత పక్షపాతం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల సమస్యలపై మోదీని ప్రశ్నిస్తాను” అని రాహుల్ వ్యాఖ్యానించారు.