బీహార్ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. బీజేపీ, జేడీయూ బంధం బలహీనపడుతోందని ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఈ టైంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో జేడీయూ,ఆర్జేడీ ప్రత్యేక సమావేశాలు జరుపుతున్నారు. నితీశ్ బీజేపీకి కటీఫ్ చెప్పి.. హస్తంతో జతకడతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. సమావేశం తర్వాత నితీశ్ కుమార్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సోనియాగాంధీతో ఫోన్ లో మాట్లాడిన నితీశ్.. సాయంత్రం ఢిల్లీకి వెళ్లి సోనియాను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు కేంద్రహోంమంత్రి అమిత్ షా నితీశ్ కు ఫోన్ చేసి మాట్లాడారు. దీంతో నితీశ్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తిగా మారింది.
ఆర్జేడీ నేతలతో తేజస్వీ యాదవ్ భేటీ
పాట్నాలోని లాలూ నివాసంలో తేజస్వి యాదవ్ RJD నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీకి లెఫ్ట్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. బీజేపీ నుంచి నితీశ్ బయటకొస్తే.. మద్దతిస్తామని గతంలోనే తెలిపింది ఆర్జేడీ. నితీశ్ నిర్ణయం కోసం ఆర్జేడీ ఎమ్మెల్యేలు వేచిచూస్తున్నారు. మరోవైపు జేడీయూ – బీజేపీ మధ్ ఎలాంటి గ్యాప్ లేదని.. జనగణన గురించే అని జేడీయూ మీటింగ్ అని ఎమ్మెల్సీ కుముద్ వర్మ స్పష్టం చేశారు
Bihar | RJD MLAs & leaders arrive at the residence of party chief Lalu Prasad Yadav, in Patna. The party will hold a meeting at 11 am today amid reports of rifts b/w JD(U) & BJP in the state.
— ANI (@ANI) August 9, 2022
Mobile phones of all MLAs are being kept outside the meeting room. pic.twitter.com/DFZP54bOvp
కాసేపట్లో ఎమ్మెల్యేలతో నితీశ్ భేటీ
మరో వైపు జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ బీజేపీతో పొత్తుకు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు . ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చేసి... విపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో బిహార్ సీఎం నితీశ్ కుమార్ అత్యవసరంగా సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే మీటింగ్ తర్వాత బీజేపీతో తెగదెంపులపై నిర్ణయం తీసుకోనున్నారు. బిహార్ లోని పరిణామాలపై అక్కడి బీజేపీ లీడర్లు స్పందించట్లేదు. ఇటీవలే పాట్నా వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా... 2024 సార్వత్రిక ఎన్నికలు, 2025లో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూతోనే కలిసి సాగుతామన్నారు. నితీశ్ నిర్ణయం తీసుకునే వరకూ వేచిచూస్తామని అమిత్ షా అన్నారు.
ఆర్సీపీ సింగ్ ను అడ్డుపెట్టుకుని జేడీయూను చీల్చే యత్నం
బీహార్ లో కూటమి ప్రభుత్వానికి తానే నేతృత్వం వహిస్తున్నప్పటికీ పలు అంశాల్లో మాట చెల్లుబాటు కావట్లేదని ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రమాజీ మంత్రి, జేడీయూ నేత ఆర్సీపీ సింగ్ పార్టీకి రాజీనామా చేసి నితీశ్ పై విమర్శలు చేశారు. ప్రధాని మోడీ కేబినెట్ లో జేడీయూ నుంచి కేంద్రమంత్రిగా పనిచేశారు ఆర్సీపీ సింగ్. రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో.... ఇటీవలే పదవికి రాజీనామా చేశారు. బీజేపీ నేతలకు సన్నిహతుడు అయిన ఆర్సీపీ సింగ్ ను అడ్డుపెట్టుకుని జేడీయూను చీల్చే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు నితీశ్.
సోనియాతో టచ్ లో నితీశ్
బిహార్ లో జేడీయూకు 43 మంది ఎమ్మెల్యేలున్నారు. బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వానికి నితీశ్ లీడర్ గా మారారు. రాజకీయంగా బలహీనపరుస్తున్న BJP నేతలు ఎంతో కాలం సీఎం పదవిలో తనను కొనసాగనీయరని నితీశ్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. దీంతో ఇవాళ JDU ఎమ్మెల్యేలు, ఎంపీలతో నితీశ్ సమావేశం కానున్నారు . కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో ఫోన్ లో మాట్లాడారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్లమెంటు సమావేశాల్లో పాల్గొన్న ఆర్జేడీ, కాంగ్రెస్ ఎంపీలు బిహార్ కు చేరుకుంటున్నారు.
జేడీయూతో ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ
జేడీయూతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని ఆర్జేడీ జాతీయ ఉపాధ్యక్షుడు శివానంద్ తివారీ అన్నారు. బీజేపీతో నితీశ్ సంబంధాలు తెంచుకుంటేనే మద్దతిస్తామన్నారు. మరోవైపు ఆర్జీడీకి అసెంబ్లీలో 75 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్, వామపక్షాలకు కలిపి మరో 35 మంది సభ్యులున్నారు. జేడీయూ, ఆర్జేడీ కలిస్తే అసెంబ్లీలో తగిన సంఖ్యాబలం ఉంటుందని తెలిపారు.
గత నెలరోజులుగా బీజేపీతో దూరంగా ఉంటున్నారు నితీశ్ కుమార్. ఆదివారం ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతిఅయోగ్ మీటింగ్ కి, గత నెల 17న అన్ని రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా నిర్వహించిన సమావేశానికి దూరంగా ఉన్నారు నితీశ్. రామ్ నాథ్ కోవింద్ పదవీవిరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు పార్టీకి, రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణస్వీకారానికి కూడా నితీశ్ హాజరవ్వలేదు.

