పల్లె ఆదాయం.. పల్లెకే ! నేరుగా వాడుకునేలా పంచాయతీరాజ్ చట్టం సవరణకు కసరత్తు

పల్లె ఆదాయం.. పల్లెకే ! నేరుగా వాడుకునేలా పంచాయతీరాజ్ చట్టం సవరణకు కసరత్తు
  •     పంచాయతీలకు ఏటా రూ.350 కోట్లకుపైగా సొంత ఆదాయం
  •     ఇప్పటివరకు ఆర్థికశాఖ అనుమతితో ట్రెజరీ ద్వారా మంజూరు
  •     బ్లీచింగ్ పౌడర్ కొనాలన్నా ట్రెజరీ చుట్టూ తిరగాల్సి వస్తోందని సర్పంచులు ఆవేదన 
  •      గ్రామాల్లో చిన్న పని చేయాలన్నా ఆర్థిక శాఖ పర్మిషన్ తీసుకోవాల్సిందే...
  •     ఇకపై ఈ విధానానికి స్వస్తి.. మంత్రి సీతక్క వద్దకు ఫైల్


హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించి, చిన్న చిన్న అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకు అడ్డుగా ఉన్న రూల్స్ ను సడలించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా పంచాయతీలకు వచ్చే సొంత ఆదాయాన్ని ట్రెజరీతో సంబంధం లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేకుండా నేరుగా ఖర్చు చేసుకునేలా పంచాయతీరాజ్ చట్టంలో కీలక సవరణలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన ఫైల్ ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పరిశీలనలో ఉంది. 


ప్రస్తుతం చిన్న పని చేయాలన్నా ట్రెజరీ చుట్టూ తిరగాల్సిందే...


ప్రస్తుతం ఉన్న పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం... పంచాయతీలకు పన్నులు, ఇతర రుసుముల ద్వారా వచ్చే ఆదాయాన్ని నేరుగా వాడుకునే వీలు లేదు. ఆ నిధులను ట్రెజరీలో జమ చేయాల్సిందే. ఒకవేళ ఆ నిధులు వాడాలంటే ఆర్థిక శాఖ అనుమతితో ట్రెజరీ ద్వారానే మంజూరు కావాలి. ట్రాక్టర్ల డీజిల్, వీధిలైట్లు, ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ కొనాలన్నా.. చిన్న పైప్ లైన్ రిపేర్ చేయించాలన్నా సర్పంచులు, కార్యదర్శులు నెలల తరబడి ట్రెజరీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ రావడంలో జాప్యం జరుగుతుండడంతో గ్రామాల్లో అత్యవసర పనులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో పడుతున్నాయి. పారిశుధ్య పనులు కూడా సకాలంలో చేయలేకపోతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం వల్ల పంచాయతీ పాలన కుంటుపడుతోందని ప్రభుత్వం గుర్తించింది. 


పంచాయతీలకు ఏటా రూ. 350 కోట్లపైగా ఆదాయం


రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామ పంచాయతీల ఉన్నాయి. వీటిలో ఇంటి పన్నులు, లేఅవుట్ ఫీజులు, నల్లా కనెక్షన్లు, వేలం పాటలు తదితర మార్గాల ద్వారా ఏటా సుమారు రూ.350 నుంచి 400 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది. ఈ నిధులు పంచాయతీల సొంతం అయినప్పటికీ, టెక్నికల్ కారణాలతో వాటిని సకాలంలో వాడుకోలేకపోతున్నారు. ఓ వైపు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీల ఖాతాల్లో పడుతుండగా.. రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్​ఎఫ్​సీ) నిధులు, గ్రామాలకు వచ్చే సొంత ఆదాయాన్ని ఖర్చు చేయాలంటే మాత్రం ఆర్థికశాఖ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో గ్రామాల్లో పనులు ఆగకూడదని భావిస్తున్న సర్పంచులు.. బయట అప్పులు తెచ్చి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఇబ్బందులను తొలగించాలని సర్పంచుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 


చట్ట సవరణతో ‘చెక్’ పవర్ మార్పు


పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించాలంటే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 70(3)ని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సవరణతో పాటు నిధుల వినియోగంలో కీలక మార్పు చేయబోతోంది. ప్రస్తుతం సర్పంచ్, ఉప సర్పంచ్​కు ఉమ్మడి ‘చెక్ పవర్’ ఉంది. అయితే, దీని వల్ల అనేక గ్రామాల్లో రాజకీయ విభేదాలు తలెత్తి నిధుల డ్రాలో జాప్యం జరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఇకపై ఉప సర్పంచ్ స్థానంలో విలేజ్ సెక్రటరీకి జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సర్పంచ్, కార్యదర్శి కలిసి గ్రామసభ తీర్మానం మేరకు నిధులు డ్రా చేసే వెసులుబాటు కల్పించనుంది. ఈ రెండు కీలక ప్రతిపాదనలకు (చట్ట సవరణ, చెక్ పవర్ మార్పు) సంబంధించిన ఫైళ్లు మంత్రి సీతక్క పరిశీలనలో ఉన్నాయి. మంత్రి ఆమోదం తెలపగానే వీటిని కేబినెట్ భేటీలో చర్చించి, జీవో లేదా ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ట్రెజరీలతో సంబంధం లేకుండా గ్రామాలు తమ సొంత నిధులను వాడుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం పట్ల స్థానిక సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామసభ తీర్మానం ద్వారా పనులకు తక్షణ నిధులు అందుతాయని, ఆర్థిక క్రమశిక్షణతో పాటు పనుల్లో వేగం పెరుగుతుందని, చిన్న చిన్న సమస్యలకు తక్షణ పరిష్కారం లభించనుందని అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే సర్పంచులపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు పల్లెల్లో అభివృద్ధి పనుల్లో ఆలస్యానికి ఆస్కారం ఉండదని ఆఫీసర్లు చెప్తున్నారు.