- రెండు సమావేశాలకు డుమ్మా కొట్టిన తెలంగాణ
- చివరి మీటింగ్‌కు కచ్చితంగా రావాలని రెండు రాష్ట్రాలకు కన్వీనర్ లెటర్
హైదరాబాద్, వెలుగు: కేఆర్‌ఎంబీ రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఆర్‌ఎంసీ) చివరి సమావేశం శనివారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జలసౌధలో జరిగే సమావేశానికి సభ్యులు హాజరు కావాలని కన్వీనర్ రవికుమార్ పిళ్లై ఇప్పటికే బోర్డు నుంచి లేఖలు రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (రూల్ కర్వ్స్), పవర్ జనరేషన్, ప్రాజెక్టులన్నీ నిండి సముద్రంలోకి నీళ్లు వృథాగా పోతున్న రోజుల్లో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కింపుపై వివాదాలు పరిష్కరించేందుకు ఆర్‌ఎంసీని ఏర్పాటు చేశారు. జూన్‌లో జరిగిన రెండు సమావేశాలకు తెలంగాణ డుమ్మా కొట్టింది. ఆ తర్వాత జరిగిన మరో రెండు సమావేశాలకు అటెండ్ అయినా తెలంగాణ అభిప్రాయాలకు ఆర్‌ఎంసీ రికమండేషన్స్‌లో చోటు దక్కలేదు. ఐదో సమావేశం నిర్వహణకు బోర్డు పలుమార్లు తేదీలు నిర్ణయించినా అటెండ్ అయ్యేందుకు తెలంగాణ ససేమిరా అన్నది. పలు కారణాలతో ఏపీ సైతం కొన్నిసార్లు రాలేమని చెప్పింది. దీంతో బోర్డు ఐదో సమావేశం నిర్వహించి మీటింగ్‌కు రెండు రాష్ట్రాల సభ్యులెవరూ హాజరుకాలేదని కేంద్ర జలశక్తి శాఖకు సమాచారం ఇచ్చింది. ఆర్‌ఎంసీ ఆరో (చివరి) సమావేశానికి 2 రాష్ట్రాల సభ్యులు హాజరుకాకుంటే ఆర్‌ఎంసీ ఫెయిలైట్టుగానే భావించాల్సి వస్తుందని, అందుకే సభ్యులంతా చివరి మీటింగ్‌కు రావాలని కొన్ని రోజుల క్రితం కన్వీనర్ లేఖలు రాశారు.
తెలంగాణ అధికారులు హాజరైతరా?
ఆర్‌ఎంసీ సిఫార్సులు తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని, రికమండేషన్స్‌లో తెలంగాణ వ్యూస్ చేర్చాలని బోర్డుకు లేఖలు రాశారు. దీనిపై బోర్డు నుంచి స్పందన రాకపోవడంతో శనివారం నిర్వహించే సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ హాజరైతే మరోసారి తమ అభిప్రాయాలను రికమండేషన్స్‌లో చేర్చాలని కోరే అవకాశముంది.

