మనుషులు ఏరినట్టే.. రెండు చేతులతో పత్తి తీయనున్న రోబో

మనుషులు ఏరినట్టే.. రెండు చేతులతో పత్తి తీయనున్న రోబో
  • రాష్ట్రంలో అందుబాటులోకి తేవడంపై ప్రభుత్వం దృష్టి
  • కోయంబత్తూరులోని ఓ కంపెనీ రోబోలను స్టడీ చేసి వచ్చిన ఆఫీసర్లు
  • వచ్చే వానాకాలంలో రాష్ట్రంలో ప్రయోగించాలని నిర్ణయం
  • సక్సెస్​ అయితే ఫామ్​మెకనైజేషన్​లో పంపిణీ చేసేలా ప్లాన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఒకటి రెండేండ్లలో పత్తి ఏరెతందుకు రోబోలు అందుబాటులోకి రానున్నాయి. సేమ్​ మనుషులు ఏరినట్టే.. రోబో రెండు చేతులతో దబ్బ దబ్బ పత్తి తీయనుంది. గెట్టు మీద కూసోని ఆపరేట్ ​చేస్తే.. మునుం బట్టి గంట సేపట్ల కిలోలకొద్ది పత్తి తీస్తది. ఇలాంటి రోబో మెషీన్లను తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ ప్రైవేటు కంపెనీ డెవలప్​ చేసింది. వాటిని పత్తి చేనులో పరీక్షించగా.. విజయవంతంగా పత్తి ఏరాయి. ఫామ్ ​మెకనైజేషన్​పై దృష్టి పెట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు కూలీల కొరత తీర్చడంపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా కోయంబత్తూరులోని పత్తి తీసే రోబోల గురించి తెలుసుకున్న రాష్ట్ర ఐటీ, అగ్రికల్చర్​ ఆఫీసర్లు ఇటీవల అక్కడికి వెళ్లారు. ఆ రోబోల పత్తి ఏరే పనితీరు, వాటి సామర్థ్యంపై స్టడీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కొన్ని కాటన్​ పికింగ్ ​రోబో మెషీన్లు తెప్పించి వచ్చే వానాకాలం సీజన్​లో పరీక్షించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. 

ఎట్ల ఏరుతదంటే..
ఈ కాటన్ ​పికింగ్ ​రోబోకు రెండు స్పెషల్ హ్యాండ్స్​ఉంటాయి. వాటితోనే అది మొక్క నుంచి పత్తి తీస్తుంది. తీసిన పత్తిని స్టోర్​ చేసుకునేందుకు మెషీన్​ వెనక భాగంలో ప్రత్యేకమైన బాక్స్​ ఒకటి ఉంటుంది. చేను గెట్టు మీద నుంచే రోబోను ఆపరేట్ ​చేయొచ్చు. ఈ రోబో 6 గంటల్లో ఒక క్వింటాలు పత్తి ఏరనుంది. రోబో ధర రూ.6 లక్షల వరకు ఉంటుందని ఆఫీసర్లు చెప్తున్నారు. అయితే ఈ మెషీన్​కు కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని, 2 హ్యాండ్స్​ కాకుండా ఫోర్ ​హ్యాండ్స్​ఉండేలా డిజైన్​ చేయాలని కంపెనీ ప్రతినిధులతో మాట్లాడినట్లు సెక్రటేరియట్ ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు తెలిపారు. ఒక్క పత్తి పంటనే కాకుండా మిర్చి, ఇతర కూరగాయలను ఏరేలా రోబో ప్రోగ్రామింగ్ ​మార్చాలని కోరారు. రాష్ట్రంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు ఎక్కువే ఉన్నాయి. ఫామ్ మెకనైజేషన్​లో భాగంగా కస్టమ్ హైరింగ్​సెంటర్లు ఏర్పాటు చేసి వాటిల్లో కాటన్​ పికింగ్​రోబో మెషీన్లను అందుబాటులో పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రెండేండ్లలోపు వినియోగంలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాటన్​ పికింగ్​రోబోలతోపాటు పంట దిగుబడిని పెంచేందుకు, సకాలంలో తగిన సూచనలిచ్చి నష్టాలు, వృథాను అరికట్టేందుకు, కూలీల కొరత సమస్యను అధిగమించేందుకు ఆర్టిఫిషియల్​ ఇంటిలెజెన్స్ పై ఐటీ, అగ్రికల్చర్ ​డిపార్ట్​మెంట్లు సంయుక్తంగా పనిచేస్తున్నాయి.

రాష్ట్రంలో పత్తే పెద్ద పంట
రాష్ట్రంలో వానకాలం సీజన్​లో ప్రధానంగా సాగయ్యే పంటల్లో పత్తిది మొదటి స్థానం. కాటన్​సాగు ఏటా పెరుగుతూ వస్తోంది. అంతర్జాతీయంగా తెలంగాణ పత్తికి డిమాండ్ ​ఉండటంతో ధర కూడా బాగానే ఉంది. దీంతో రైతులు పెద్ద ఎత్తున పత్తి వేస్తున్నారు. అయితే పత్తి సాగులో కూలీల కొరత రైతులను ఇబ్బంది పెడుతోంది. విత్తనాలు పెట్టేటప్పుడు, ఎరువులు వేసేందుకు, కలుపు, పత్తి ఏరేందుకు కూలీలు దొరకడం లేదు. రూ.300 నుంచి రూ.500 వరకు చెల్లించినా టైంకు రావడం లేదు. పత్తి చేతికొచ్చినప్పటికీ కూలీలు దొరక్క చేనులోనే వానలకు పాడైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాటన్ ​పికింగ్ ​రోబోలు అందుబాటులోకి వస్తే పత్తి రైతులకు పెద్ద ఊరట కలుగుతుంది.