- హైడ్రోపోనిక్ గంజాయిని దేశమంతా సరఫరా చేస్తున్న ముంబై గ్యాంగ్
- మొత్తం 150 మంది క్యారియర్లు, హైదరాబాద్‌కు చెందిన 15 మంది
- శంషాబాద్ సహా ఐదు ఎయిర్‌పోర్టుల మీదుగా ఇండియాలోకి సరఫరా
- సిండికేట్‌లో గ్యాంగ్ స్టర్స్, షార్ప్ షూటర్స్
- డీఆర్‌ఐ, కస్టమ్స్‌తో కలిసి ఈగల్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్
- కింగ్‌పిన్ హేమాంగ్ ప్రమోద్ సహా 15 మంది అరెస్ట్,
- 13 కోట్ల విలువైన ఓషన్ గాంజా స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: థాయ్‌లాండ్ కేంద్రంగా ముంబై గ్యాంగ్ స్టర్స్ నిర్వహిస్తున్న హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్ రాకెట్‌ను రాష్ట్ర ఈగల్ ఫోర్స్ ఛేదించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్డులో పట్టుబడుతున్న క్యారియర్లను విచారించి.. థాయ్‌లాండ్, ముంబై డ్రగ్స్ సిండికేట్ ముఠా గుట్టురట్టు చేసింది. ఏప్రిల్ 19 నుంచి ‘ఆపరేషన్ ఓజీ’ నిర్వహించింది. ముంబైకి చెందిన హేమాంగ్ ప్రమోద్ కెలుస్కర్ సహా హైదరాబాద్‌కు చెందిన 13 మందిని కస్టమ్స్, డీఆర్‌ఐతో కలిసి అరెస్ట్ చేసింది.
రూ.13 కోట్లు విలువ చేసే13.2 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని సీజ్ చేసింది. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్ సిండికేట్ వివరాలను ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా గురువారం వెల్లడించారు. ఈ సిండికేట్‌లోని ముంబై గ్యాంగ్ స్టర్స్ హైదరాబాద్ కోకాపేటలో కూడా పబ్బులు, క్లబ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. అదే జరిగితే హైదరాబాద్ గ్యాంగ్‌స్టర్స్ నెట్‌వర్క్‌లోకి వెళ్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 8న బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన సోదా మోహ్సిస్ బహదుర్ భాయ్ అనే ప్రయాణికుడిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతని బ్యాగేజ్ నుంచి రూ.13 కోట్లు విలువ చేసే 13.2 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అదే ఫ్లైట్‌లో వచ్చిన అతని సహచరుడు హర్షద్ మంసుఖ్ భాయ్ ప్రజాపతి మరో హైడ్రోపోనిక్ గంజాయితో బ్యాగ్‌తో తప్పించుకున్నాడు. కస్టమ్స్ అధికారులు ఇచ్చిన సమాచారంతో రాచకొండ నార్కొటిక్స్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
కస్టమ్స్‌కి చిక్కిన బహదుర్ ను విచారించారు. అతను ఇచ్చిన సమాచారంతో ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో ఆర్‌సీ పురం బీహెచ్ఎల్ జంక్షన్ వద్ద ఈగల్ ఫోర్స్ నిఘా పెట్టింది. ఈ తనిఖీల్లో హర్షద్ తో పాటు మరో నిందితుడు సందీప్ వాస్వాని అలియాస్ రాహుల్ జైన్ ఈగల్‌కు చిక్కారు. వీరి వద్ద 12.739 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి, మొబైల్ ఫోన్లు, ఐడీ కార్డులు, ట్రావెల్ టికెట్లను ఈగల్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
థాయ్‌లాండ్‌లో గంజాయి సాగు..
కస్టమ్స్‌కు చిక్కిన సోదా మోహ్సిస్ తో పాటు ఈగల్‌కు చిక్కిన హర్షద్ ను ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా ఆధ్వర్యంలో విచారించారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 8న శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కస్టమ్స్‌కు చిక్కిన గుజరాత్ ముంద్రా పోర్ట్‌కు చెందిన తల్ అబ్దుల్లా భాయ్ సద్రుద్దిన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుతో పాటు ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల నుంచి హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఈగల్ దర్యాప్తులో వెలుగు చూసింది.
థాయ్‌లాండ్, -హైదరాబాద్, ముంబై మధ్య హైడ్రోపొనిక్ గంజాయి స్మగ్లింగ్ చేసేందుకు సిండికేట్ నడుపుతున్నట్టు తేలింది. కాగా, ఈ నెట్‌వర్క్‌లో క్యాష్ పేమెంట్స్ మినహా ఎలాంటి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడంలేదని ఈగల్ ఫోర్స్ దర్యాప్తులో వెలుగు చూసింది. గుజరాత్, ముంబైలోని హవాలా వ్యాపారుల ద్వారా థాయ్ బాట్స్ కొనుగోళ్లు, మనీలాండరింగ్ ద్వారా లావాదేవీలు జరుగుతున్నట్టు ఈగల్ ఫోర్స్ ఇన్వెస్టిగేషన్‌లో బయటపడింది. హైడ్రోపొనిక్ గంజాయి స్మగ్లింగ్ చేస్తూ డీఆర్‌ఐ, కస్టమ్స్‌కు చిక్కిన క్యారియర్లు వెల్లడించిన వివరాల ఆధారంగా థాయ్‌లాండ్, ముంబై సిండికేట్ నెట్‌వర్క్‌ను ఛేదించింది.
ముంబైలో గ్యాంగ్‌స్టర్ స్మగ్లింగ్ దందా
ముంబైకి చెందిన హేమాంగ్ ప్రమోద్ కెలుస్కర్ అతని తండ్రి ప్రమోద్ బాబు కెలుస్కర్, దుబాయ్‌లో నివాసం ఉంటున్న జేతమ్ ఫైసల్ గులామ్ మహమ్మద్ సహకారంతో గతంలో అఫ్జల్ టొబాకో, విమల్ గుట్కా, బంగారం స్మగ్లింగ్ చేసేవారు. అడ్డొచ్చిన వారిని అతి కిరాతకంగా హతమార్చేవారు. ఇందుకోసం షార్ప్‌షూటర్స్‌ను స్మగ్లింగ్‌లో నియమించుకున్నారు. స్మగ్లింగ్‌లో అదే ప్రాంతానికి చెందిన ప్రవీణ్ లాహు రౌత్, సురజ్ పాల్ అలియాస్ కబీర్ కుమార్ ఆర్య హవాలా రూపంలో లావాదేవీలు జరిపేవారు.
వీరితో పాటు ముంబై కుర్ల ఈస్ట్‌కు చెందిన మహమ్మద్ ముస్తఫా ఇస్మాయిల్ హవాలా ఆపరేటర్‌గా పనిచేస్తూ, అరబ్ దేశాలు, థాయ్ లాండ్‌కు నిధులు సమకూర్చడంలో హేమాంగ్ కెలుస్కర్‌కు సహకరించేవాడు. ముంబైలో ఇండియన్ కరెన్సీ సేకరించి, స్థానిక ఖాతాదారుల ద్వారా విదేశీ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయించేవాడు. ఈ క్రమంలోనే 2013లో తండ్రి ప్రమోద్ బాబు కెలుస్కర్‌తో కలిసి రూ.500 కోట్లు విలువ చేసే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ హేమాంగ్ ప్రమోద్ కెలుస్కర్ డీఆర్‌ఐ అధికారులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత కూడా స్మగ్లింగ్ కొనసాగించిన హేమాంగ్.. 2023లో అతని తమ్ముడు సుధాంశతో కలిసి థాయ్‌లాండ్‌లోని పటాయాలో జల్వా క్లబ్ ప్రారంభించాడు.
హైదరాబాద్‌కు చెందిన 15 మంది క్యారియర్లు
హేమాంగ్.. థాయ్‌లాండ్‌లో జల్వా క్లబ్ నిర్వహిస్తూ.. అక్కడే రెండు ప్రాంతాల్లో హైడ్రోపొనిక్ గంజాయి సాగుచేస్తున్నాడు. జల్వా క్లబ్‌కు బాలివుడ్ నటులతో పాటు దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు వస్తుండేవారు. వీరికి హైడ్రోపొనిక్ గంజాయి సహా అవసరమైన సింథటిక్ డ్రగ్స్ సప్లయ్ చేసేవారు. ఈ క్రమంలోనే థాయ్‌లాండ్‌లో సాగు చేసిన ఓషన్ గాంజాను ఇండియాకు సప్లయ్ చేసేందుకు హేమాంగ్ ముంబైలోని మరికొంత మంది గ్యాంగ్‌స్టర్స్, షార్ప్ షూటర్స్‌తో కలిసి సిండికేట్ ఏర్పాటు చేశాడు.
ఇందులో ఒకడైన షార్ప్ షూటర్ సురజ్ పాల్ అలియాస్ కబీర్ కుమార్ ఆర్యకు సిండికేట్ బాధ్యతలు అప్పగించాడు. సురజ్ పాల్ మాదక ద్రవ్యాలను ట్రాన్స్‌పోర్ట్ చేసేందుకు క్యారియర్లను సమకూర్చడంతో పాటు, క్యారియర్లకు ఫ్లైట్ టికెట్లు, థాయ్‌లాండ్ నుంచి స్మగ్లింగ్ అయిన గంజాయి సేకరించడం స్థానిక పెడ్లర్లరు విక్రయించడం వంటి కార్యకలాపాలు నిర్వహించేవాడు. సిండికేట్ క్యారియర్లలో ముంబైకి చెందిన 50 మంది యువకులతో పాటు హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ రషీద్, అమన్, ఇబ్రహీం అబ్దుల్లా బిన్ ఉస్మాన్ సహా మొత్తం 15 మంది హైడ్రోపొనిక్ గంజాయి నెట్‌వర్క్‌లో చిక్కుకున్నారు.
ఇలా దేశవ్యాప్తంగా మొత్తం 150 మందిని గంజాయి క్యారియర్లుగా ఏర్పాటు చేసుకున్నారు. థాయ్‌లాండ్‌కు పంపించి.. పటాయాలోని హోటళ్లలో వసతి కల్పించేవారు. ఎయిర్‌పోర్టులో పట్టుపడకుండా హైడ్రోపొనిక్ గాంజాను ప్యాకింగ్ చేసేవారు. ఢిల్లీ, ముంబై, శంషాబాద్ ఎయిర్‌పోర్టు సహా ఐదు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల మీదుగా ట్రాన్స్‌పోర్ట్ చేసేవారు. రోడ్డు మార్గంలో గమ్యస్థానాలకు చేర్చే వారు. ఆ తర్వాత స్థానిక పెడ్లర్లు, కస్టమర్లకు విక్రయించేవారు.
హైదరాబాద్‌లోనూ క్లబ్ ఏర్పాటుకు సన్నాహాలు
థాయ్‌లాండ్‌లో జల్వా క్లబ్ తరహాలోనే హైదరాబాద్‌లో కూడా అలాంటి క్లబ్ లేదా పబ్‌ను ఏర్పాటు చేసేందుకు హేమాంగ్ ప్రమోద్ కెలుస్కర్ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 3న హైదరాబాద్‌కు వచ్చాడు. తాజ్‌కృష్ణ హోటల్ బసచేశాడు. క్లబ్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన ల్యాండ్ డీల్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. కాగా, అప్పటికే హేమాంగ్ ప్రమోద్ కెలుస్కర్ కదలికలపై నిఘా పెట్టిన ఈగల్ ఫోర్స్‌కు.. సమాచారం అందింది. దీంతో ఈగల్ ఫోర్స్ అధికారులు హేమాంగ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హేమాంగ్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలు రిమాండ్‌లో ఉన్నాడు. థాయ్‌లాండ్‌లో జల్వా క్లబ్ నిర్వహిస్తూ గంజాయి ఎక్స్‌పోర్ట్ చేస్తున్న అతని తమ్ముడు సుధాంశపై రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
