వర్షాలు, వరదలతో రూ. 4,413 కోట్ల నష్టం

వర్షాలు, వరదలతో రూ. 4,413 కోట్ల నష్టం
  • రూ. 4,413 కోట్ల నష్టం.. 
  • రాష్ట్ర సర్కార్​కు అధికారుల నివేదిక
  • రాష్ట్రవ్యాప్తంగా 32 మంది మృతి 
  • 934 గ్రామాల్లో 12,704 ఇండ్లు దెబ్బతిన్నయ్​
  • పంట నష్టమే రూ. 3 వేల కోట్లు 
  • నేడు, రేపు సెంట్రల్ టీమ్స్ పర్యటన
  • తక్షణ సాయం కింద రూ. వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్రం

హైదరాబాద్​, వెలుగు : వర్షాలు, వరదలతో రూ. 4,413 కోట్ల నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు ప్రాథమిక నివేదిక అందజేశారు. ఇందులో పంట నష్టమే రూ. 3 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. లక్ష మందికిపైగా బాధితులు గూడు చెదిరి రోడ్డునపడ్డట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే.. వరదల వల్ల రూ. 1,400 కోట్లు నష్టం వాటిల్లినట్లు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రిలిమినరీ రిపోర్టు ఇచ్చింది. ఇందులో పంట నష్టాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన హైపవర్​ కమిటీ గురువారం, శుక్రవారం రాష్ట్రంలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయనుంది. ఈ కమిటీ రెండు టీమ్​లుగా జిల్లాల్లో పర్యటించనుంది. 

గూడు చెదిరి..
934 గ్రామాల్లో 12,704 ఇండ్లు దెబ్బతిన్నాయని, ఇందులో దాదాపు 600 ఇండ్లు పూర్తిగా కూలిపోయాయని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్నారు.  1,456 పశువులు మృత్యువాత పడ్డాయని తెలిపారు. వర్షాలకు, వరదలకు గ్రామాలు నీట మునగడంతో దిక్కుతోచని స్థితిలో వేలాది మంది బాధితులు పునరావాస కేంద్రాలకు చేరుకున్నారని వివరించారు. 1,04,399 మంది ఇండ్లను వదిలిపెట్టారని, ఇందులో కొందరు బంధువుల ఇండ్లలో, మరో 61,104 మంది ప్రభుత్వ షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారని అధికారులు రిపోర్టు ఇచ్చారు.  భద్రాద్రి కొత్తగూడెంలో 27,778 మంది, జగిత్యాలలో 3,078 మంది, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో 3,049 మంది, మంచిర్యాల జిల్లాలో 8,441 మంది, ములుగు జిల్లాలో 7,536 మంది, నిర్మల్ జిల్లాలో 4,012 మంది, నిజామాబాద్​ జిల్లాలో 2,192 మంది, పెద్దపల్లి జిల్లాలో 2,417 మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. మొత్తం 32 మంది వానలకు, వరదలకు చనిపోయారని అధికారులు రిపోర్ట్​ ఇచ్చారు. కొంతమంది వరదల్లో, కెనాల్స్​లో కొట్టుకుపోగా, ఇంకొందరు కరెంట్​ షాక్​కు గురై చనిపోయినట్లు,  మరికొందరు గోడలు కూలి మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. 

రైతుకు కన్నీళ్లు
వర్ష బీభత్సం రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. రాష్ట్రంలో దాదాపు 14  లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని, ఇందులో 60 శాతం పంట పూర్తిగా దెబ్బతిన్నదని, రూ. 3 వేల కోట్లు పైన నష్టం సంభవించినట్లేనని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 134  మండలాలు 934 గ్రామాల్లో వర్షాలు, వరదల ప్రభావం ఉన్నట్లు రిపోర్ట్​లో తెలిపారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలా బాద్,​ నిజామాబాద్​ జిల్లాల్లో ఎక్కువగా పంటలు దెబ్బతిన్నాయి. పత్తి పంటతో పాటు  సోయాబీన్, మక్క పంటలు మొలక దశలోనే దెబ్బతిన్నాయి. చాలాచోట్ల వరినార్లు మురిగిపోయాయి. 

రోడ్లు కొట్టుకపోయినయ్​.. చెరువులు తెగినయ్
వరదలకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చెరువుల కట్టలు తెగిపోగా,  మరికొన్ని చెరువులకు బుంగలు పడ్డాయి.  మొత్తంగా 494  చెరువులు, ట్యాంకులు, కెనాల్స్​, ప్రాజెక్టులు దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు రిపోర్ట్​ ఇచ్చారు. వీటి రిపేర్ల కోసం  రూ. 33.50 కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్ట్​ పంప్​హౌజ్​ల మునక నష్టం కలపలేదని తెలిసింది. పీఆర్​ రోడ్లు 828 కిలో మీటర్ల మేర  దెబ్బతిన్నాయి. 244  చోట్ల రోడ్లు తెగిపోయాయి. కొన్ని చోట్ల సీడీ వర్క్స్​కు నష్టం వాటిల్లింది.  324 చోట్ల ఆర్‌ అండ్​ బీ రోడ్లు,  కొన్ని ప్రాంతాల్లో  నేషనల్‌ హైవేలు దెబ్బతిన్నాయి.  

తక్షణ సాయం వెయ్యి కోట్లు ఇవ్వండి 
వరద నష్టం కింద రూ.1,000 కోట్లను తక్షణ సాయం కింద విడుదల చేయాలని కేంద్రాన్ని  రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వరద నష్టంపై ప్రాథమిక అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి కేంద్రానికి నివేదించింది. పలు శాఖల్లో సుమారు రూ.1,400 కోట్లు వరద నష్టం సంభవించినట్టుగా  కేంద్రానికి రిపోర్టు చేసింది. ఇందులో పంట నష్టం వివరాలు పంపలేదు.

పంట నష్టంపై తర్జనభర్జన
పంట నష్టం ఎంత చెప్పాలనే దానిపై రాష్ట్ర సర్కార్​ తర్జనభర్జన పడుతున్నది. పంట నష్టం ప్రాథమిక అంచనా 14 లక్షల ఎకరాలు దాటుతుందని అగ్రికల్చర్​ ఉన్నతాధికారి ఒకరు ప్రభుత్వానికి నివేదిస్తే.. ‘‘అంత నష్టం ఉంటుందా ?’’ అని  ప్రభుత్వ పెద్దలు అన్నట్లు తెలిసింది. వానలు, వడగండ్లు, వరదల వల్ల పంటలు నష్టపోతే వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేస్తుంది. తర్వాత సర్కార్ అనుమతితో సమగ్ర పంట నష్టం వివరాలను సేకరిస్తుంది. దానికి  ఎన్డీఆర్ఎఫ్​, ఎస్డీఆర్ఎఫ్​ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్​పుట్ సబ్సిడీని చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా పంట 33 శాతం పైగా దెబ్బతింటే ఎకరాకు ఇంత అని లెక్కగట్టి పరిహారం ఇవ్వాలి. ఆ ప్రకారం ఎకరా వరికి ఇన్ పుట్ సబ్సిడీ రూ.5,463, పత్తి, కంది, సోయాబీన్, పెసర, జొన్నలు, వేరుశనగకు రూ.2,751 చొప్పున, మొక్కజొన్నకు రూ.3,372 చెల్లించాల్సి ఉంటుంది. పంట నష్టంపై వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టడం లేదు.  అధికారులు ఇచ్చిన రిపోర్టులోని పంట నష్టాన్ని తగ్గించి చూపే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలిసింది.