CAAకు అనుకూలంగా ప్రచారం చేయాలె

CAAకు అనుకూలంగా ప్రచారం చేయాలె

    చట్టంతో ఉపయోగాలేంటో ప్రజలకు చెప్పాలె

    శిబిరం, సభ సక్సెస్ వెనుక  కార్యకర్తల శ్రమ కన్పించింది

    ఇదే స్ఫూర్తితో పల్లె, పల్లెకూ వెళ్లి పని చేయాలె 

    కార్యకర్తలకు ఆరెస్సెస్ చీఫ్​మోహన్ భగవత్ దిశానిర్దేశం  

    మూడు రోజుల ‘విజయ సంకల్ప శిబిరం’ ముగింపు 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిటిజన్షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ ( సీఏఏ )కు అనుకూలంగా స్వయం సేవకులు తమ శాఖల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆరెస్సెస్ చీఫ్​మోహన్ భగవత్ ఆదేశించారు. సీఏఏ వల్ల దేశానికి జరిగే మేలు, సమాజానికి ఇది ఎలా ఉపయోగపడుతుందనేది ప్రచారం చేయాలని, పల్లె, పల్లెనా ప్రజల్లో చైతన్యం తేవాలని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నంలో మూడు రోజుల ‘విజయ సంకల్ప శిబిరం’ గురువారం ‘సమారోప్’ కార్యక్రమంతో ముగిసింది. ఈ సందర్భంగా భగవత్ మాట్లాడుతూ.. శిబిరం ఏర్పాట్లలో,  సభ సక్సెస్ లో సంఘ్ సేవకుల శ్రమ, అంకిత భావం స్పష్టంగా కనిపించిందన్నారు. కార్యకర్తలు ఇదే స్ఫూర్తితో కింది స్థాయి వరకూ వెళ్లి సంఘ్ విస్తరణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సామాజిక సేవ విస్తృతం చేయాలె

సామాజిక సేవా కార్యక్రమాలు, గో సంరక్షణ, హిందూ ధర్మ ప్రచారం, కుటుంబ వ్యవస్థ, పర్యావరణ పరిరక్షణ, ఫారిన్ కల్చర్ దరి చేరనీయకుండా మన కల్చర్, ట్రెడిషన్స్ ను పరిరక్షించడంపై కూడా సంఘ్ సేవకులు దృష్టి సారించాలని కార్యకర్తలకు సంఘ్ చీఫ్ భగవత్ ఇతర ముఖ్య నేతలు సూచించారు. లోకల్ సమస్యలను అవగాహన చేసుకుని, వాటి పరిష్కారంపై దృష్టి సారిస్తే జనంలో సంఘ్ కు ఆదరణ ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. స్వయం సేవకుల ప్రేమ, శ్రమించే తత్వమే రాష్ట్రంలో ఆరెస్సెస్ విస్తరణకు ప్రధాన సాధనాలు కావాలని, కార్యకర్తల ప్రవర్తన, భాష, సానుకూల ఆలోచనలు, వాటిని తెలిపే విధానమే సంఘ్ విస్తరణలో కీలకమని నేతలు దిశానిర్దేశం చేశారు.

ఆరెస్సెస్ వర్గాల్లో జోష్​

శిబిరం ముగింపు అనంతరం గురువారం సాయంత్రం సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ హైదరాబాద్ లోని సంఘ్ రాష్ట్ర కార్యాలయమైన కేశవ నిలయం చేరుకొని, రాత్రి అక్కడి నుంచి బెంగళూర్ వెళ్లారు. శిబిరంలో పాల్గొన్న ముఖ్య సంఘ్ చాలక్ లు, బీజేపీ నేతలు కూడా తిరుగు ప్రయాణమయ్యారు. ఇక విజయ సంకల్ప శిబిరం, సార్వజనికోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో రాష్ట్రంలో హిందూత్వం మరింత బలోపేతం అవుతుందని ఆరెస్సెస్ నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సంఘ్ పునాదులను పటిష్ట పరుచుకునేందుకు ఈ సభ స్ఫూర్తిగా నిలుస్తుందని భావిస్తున్నారు.