సమాజం పట్ల ప్రేమ, ఆప్యాయత ఉండాలి: RSS ప్రచారక్ ఆలె శ్యాంకుమార్

సమాజం పట్ల ప్రేమ, ఆప్యాయత ఉండాలి:   RSS ప్రచారక్ ఆలె శ్యాంకుమార్

హిందువుల రక్షణే ధ్యేయంగా RSS ఏర్పడిందన్నారు ఆసంస్థ ప్రచారక్ ఆలె శ్యాంకుమార్. రామ జన్మభూమి విజయమే హిందూ సమాజ జాగృతి, చైతన్యానికి నిదర్శనమన్నారు. సంఘ్ భావాజాలాన్ని వ్యాప్తి చేసేందుకు…సమాజం పట్ల ప్రేమ, ఆప్యాయతలతో మెలగాలన్నారు. హైదరాబాద్ లోని భారత్ ఇంజినీరింగ్ కాలేజీలో RSS విజయ సంకల్ప శిబిరం సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. శిబిరానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీఎంపీ వివేక్, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ , సోయం బాపూరావుతో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు.

మొదటి రోజు సమావేశానికి 8వేల మంది సంఘ్ సభ్యులు హాజరయ్యారు. 34 RSS అనుబంధ సంఘాలు శిబిరానికి వచ్చాయి. 15 ఏళ్ల సంఘ్ సేవక్ నుంచి మొదలుకుంటే 80 ఏళ్ల కర సేవక్ వరకు…. ముఖ్య శిక్షక్ నుంచి జాతీయ అధ్యక్షుడు, ఎంపీలు, ఎమెల్యేలంతా ఒకే చోట హోదా, పదవి తేడా లేకుండా నేలపైనే భోజనం చేయడం, నిద్రించడం, కూర్చోవడం ఈ శిబిరం ప్రత్యేకత. సాధారణంగా ఇలాంటి శిబిరాల్లో మీడియాకు అనుమతినివ్వరు. కానీ ఈసారి మాత్రం కొద్దిసేపు లోపలికి అనుమతించారు. డ్రెస్​ కోడ్​ నిక్కరుకు బదులు పాంట్​ తీసుకువచ్చాక జరుగుతున్న భారీ శిబిరం ఇదే కావడంతో… సంఘ్ సేవకుల యునిఫామ్ కొత్తగా కనిపించింది.

మూడు రోజుల శిబిరంలో భాగంగా సంఘ్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ స్టేడియంలో ఇవాళ భారీ బహిరంగ సభ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు జరగనున్న సభలో RSS సర్ సంఘ్ ఛాలక్ మోహన్ భగవత్ ప్రధానోపన్యాసం చేయనున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త BVR మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభకు హాజరయ్యే కార్యకర్తలు మన్సూరాబాద్, హస్తినాపురం, వనస్థలిపురం నుంచి మార్చ్ చేస్తూ వచ్చి LBనగర్ క్రాస్ రోడ్డు దగ్గర కలుస్తారు. అక్కడి నుంచి స్టేడియానికి వెళతారు. 25 వేల మంది ఇందులో పాల్గొననున్నారు.