ఆర్టీఐ బిల్లు పాస్.. ప్రతిపక్షాలను పట్టించుకోని ప్రభుత్వం

ఆర్టీఐ బిల్లు పాస్.. ప్రతిపక్షాలను పట్టించుకోని ప్రభుత్వం

ఆర్టీఐ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును లోక్​సభ ఆమోదించింది. ఆర్టీఐ చట్టాన్ని నీరుగారుస్తున్నారంటూ ఓవైపు ప్రతిపక్షాలు వ్యతిరేకించినా, పట్టించుకోకుండా బిల్లును సోమవారం పాస్ చేసింది. రైట్​టు ఇన్ఫర్మేషన్ (అమెండ్​మెంట్) బిల్-2019 ప్రకారం.. సమాచర కమిషనర్లకు ఇకపై ఎలక్షన్ కమిషనర్లతో సమాన స్థాయి ఉండదు. అలాగే సమాచార కమిషనర్ల జీతాలు, పదవీకాలం, సర్వీసు నిబంధనలు తదితర టర్మ్స్​పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేంద్రానికి కల్పించారు. తమ అభ్యంతరాలను అధికార పక్షం పట్టించుకోకపోవడంతో ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.

ఎన్​హెచ్ఆర్సీ మాదిరి కోరలు లేని పులి ఆర్టీఐ

సోమవారం లోక్​సభలో బిల్లుపై చర్చ సందర్భంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సవరణల పేరుతో సమాచార హక్కు చట్టం అధికారాలను తగ్గించాలని చూస్తోందని ఫైర్ అయ్యాయి. బిల్లును ఆమోదిస్తే నేషనల్ హ్యమన్ రైట్స్ కమిషన్ (ఎన్​హెచ్ఆర్సీ) మాదిరి కోరలు లేని పులిలా ఆర్టీఐ మారిపోతుందని ఆరోపించాయి. ప్రభుత్వం తీసుకొచ్చినది అమెండ్​మెంట్ బిల్లు కాదని, ఎలిమినేషన్ బిల్లు అని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ విమర్శించారు. సవరణలు ఆమోదిస్తే సమచార కమిషనర్లు.. ప్రభుత్వ పని మనుషుల్లా మారిపోయే పరిస్థితి ఉంటుందని డిఎంకే నేత ఎ.రాజా విమర్శించారు. మరోవైపు ప్రజలను తప్పుదోవపట్టించేందుక ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. బిల్లుకు మద్దతివ్వాలని కోరారు.

ఎంపీలు వ్యతిరేకించాలి: మాజీ సీఐసీ శ్రీధర్

సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ)​కు వెన్నుపోటు పొడిచేలా కేంద్ర చేసిన సవరణలు ఉన్నాయని, ఇది ఆర్టీఐ చట్టాన్ని చావుదెబ్బ తీయడమేనని మాజీ సీఐసీ శ్రీధర్ ఆచార్యులు అన్నారు. లోక్​సభ, రాజ్యసభ ఎంపీలందరూ బిల్లును వ్యతిరేకించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రతిపాతనలు సమాచార కమిషన్ల స్వయం ప్రతిపత్తిని బలహీనపరిచేలా ఉన్నాయన్నారు.