- 95.80 వద్ద సరికొత్త ఆల్ టైమ్ లో
- గత ఐదేళ్లలో 30 శాతం క్షీణత
- గత రెండున్నర నెలల నుంచి 100 డాలర్లపైనే ఆయిల్ ధరలు
- కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు..
ముంబై: రూపాయి పతనం కొనసాగుతోంది. ఆయిల్ ధరలు భారీగా పెరగడంతో డాలర్‌తో మన కరెన్సీ విలువ పడిపోతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 6 శాతం తగ్గిన రూపాయి విలువ, బుధవారం 95.80 వద్ద సరికొత్త జీవితకాల కనిష్టాన్ని నమోదు చేసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి కొంత కోలుకుని 95.67 వద్ద స్థిరపడింది. 2021 మే 13న సుమారు 73.44 వద్ద ఉన్న రూపాయి, గత ఐదేళ్లలో మొత్తం రూ.22.23 క్షీణించింది. ఇది దాదాపు 30.2 శాతం తగ్గుదల.
క్రూడాయిల్ ధరలు పెరగడం..
ఇరాన్–అమెరికా యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. గ్లోబల్‌గా జరిగే ఆయిల్ రవాణాలో 20 శాతం హార్మూజ్ జలసంధి ద్వారా జరుగుతోంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసేయడంతో ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 120 డాలర్లకు ఎగిశాయి. ప్రస్తుతం 108 డాలర్ల దగ్గర ట్రేడవుతున్నాయి.
ఇండియా కొనుగోలు చేస్తున్న ఇండియా బాస్కెట్ ధర 109 డాలర్లుగా ఉంది. ఆయిల్ ధరలు పెరగడంతో ఇండియా దిగుమతి ఖర్చులు ఎక్కువయ్యాయి. అంతర్జాతీయ చెల్లింపులు ఎక్కువగా డాలర్లలో జరుగుతాయి. కాబట్టి డాలర్‌కు డిమాండ్ పెరుగుతోంది. రూపాయి క్షీణిస్తోంది. ఆరు ప్రధాన కరెన్సీలతో డాలర్ బలాన్ని పోల్చే డాలర్ ఇండెక్స్ బుధవారం 0.22 శాతం పెరిగి 98.51 వద్ద ట్రేడ్ అయ్యింది.
దేశం విడిచి వెళ్లిపోతున్న ఫారిన్ ఇన్వెస్టర్లు
ఇండియాలోకి పెద్ద మొత్తంలో డాలర్లను తెచ్చే ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) తిరిగి వెళ్లిపోతున్నారు. అది కూడా పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్ నుంచి విత్‌డ్రా చేసుకుంటున్నారు. రూపాయి విలువ క్షీణించడంతో వీరి లాభాలు తగ్గిపోతున్నాయి. ఉదాహరణకు, రూపాయి 70 దగ్గర ఉన్నప్పుడు ఇండియాకు వచ్చిన ఇన్వెస్టర్లు, ప్రస్తుతం 95.67 దగ్గర తమ రూపాయిలను డాలర్లలోకి మార్చాల్సి వస్తోంది. దీంతో గత ఐదేళ్లలో వీరి లాభాలు కేవలం రూపాయి క్షీణత వలనే 23.6 శాతం తగ్గిపోయాయి.
ఫారిన్ ఇన్వెస్టర్లు ఈ ఏడాది స్టాక్ మార్కెట్ నుంచి నికరంగా రూ. 2 లక్షల కోట్లను విత్‌డ్రా చేసుకున్నారు. ఒక వైపు ఇండియా ఇంపోర్ట్ బిల్లు పెరగడం, మరోవైపు ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్లు వెళ్లిపోతుండడంతో మన కరెన్సీపై ఒత్తిడి ఎక్కువైంది. ఈ రెండు కూడా ఒకేసారి, షార్ట్ టర్మ్‌లో జరుగుతుండడంతో ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటున్నా రూపాయి పతనం ఆగడం లేదు.
లాభాల్లోకి మార్కెట్
వరుస నాలుగు రోజుల నష్టాల తర్వాత బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 33 పాయింట్లు (0.14శాతం) పెరిగి 23,413 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 50 పాయింట్లు లాభపడి 74,607 వద్ద సెటిలైంది.
గత ఐదేళ్లలో మే 13 న రూపాయి ఇలా..
ఏడాది విలువ (సుమారు)
2026 95.67
2025 83.50
2024 83.30
2023 82.20
2022 77.40
2021 73.44
ప్రభుత్వ చర్యలు..
- 1) విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను 15 శాతానికి పెంచింది. దీంతో విదేశాల నుంచి ఈ లోహాల కొనుగోళ్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. క్రూడాయిల్ తర్వాత ఎక్కువగా బంగారం, వెండి వంటి లోహాలను మనం దిగుమతి చేసుకుంటున్నాం. ప్రజలు బంగారం, క్రూడాయిల్, వంట నూనె వినియోగంలో 10 శాతం తగ్గించినా 45 బిలియన్ డాలర్లు వరకు విదేశీ మారక నిల్వలను ఆదా చేయొచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ నెల 1 నాటికి ఇండియా వద్ద 690.7 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. రూపాయి పతనాన్ని ఆపేందుకు ఆర్‌బీఐ డాలర్లను అమ్ముతోంది. ఫలితంగా ఈ నిల్వలు తగ్గుతున్నాయి. రూపాయి మరింత క్షీణిస్తే ఆర్‌బీఐ మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
- 2)రూపాయిపై ఒత్తిడిని తగ్గించేందుకు కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మారాలని పిలుపిచ్చారు. దీంతో పాటు ప్రభుత్వం ఇతర దేశాల నుంచి ఆయిల్ కొనుగోళ్లను పెంచింది. వివిధ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ (ఎఫ్‌టీఏలు) కుదుర్చుకుంటూ, మన ఎగుమతులను పెంచే చర్యలు తీసుకుంది.
- 3) రాబోయే రోజుల్లో రూపాయి విలువ డాలరుతో పోలిస్తే 95.45 నుంచి 96.15 పరిధిలో కదలాడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
- 4) రూపాయి విలువ పడితే దిగుమతిదారులు నష్టపోతారు. కానీ, ఎగుమతిదారులు లాభపడతారు. రూపాయల్లో వీరి ఆదాయం పెరుగుతుంది.
