అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదొడుకులు, భౌగోళిక ఉద్రిక్తతల దెబ్బకు మన కరెన్సీ రూపాయి విలువ ఘోరంగా పడిపోతోంది రోజురోజుకూ. మే 20న ట్రేడింగ్ ప్రారంభంలోనే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 33 పైసలు క్షీణించి.. 96.90 వద్ద మునుపెన్నడూ లేని విధంగా జీవితకాల కనిష్ట స్థాయికి పడిపోయింది. గత సెషన్‌లో 96.53 వద్ద ముగిసి సరికొత్త రికార్డు సృష్టించిన రూపాయి, మరుసటి రోజే ఆ రికార్డును అధిగమించి మరింత దిగజారడం ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత 7 సెషన్లుగా రూపాయి విలువ వరుసగా సరికొత్త కనిష్టాలను తాకుతూ పాతాళానికి పడిపోతోంది.
ఈ ఏడాది ఆరంభం నుంచి రూపాయి ప్రయాణం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. జనవరి నుంచి ఇప్పటివరకు రూపాయి విలువ ఏకంగా 7 శాతానికి పైగా క్షీణించి.. ఆసియాలోనే అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచిన కరెన్సీగా నిలిచింది. ఈ ఒక్క వారంలోనే 0.6 శాతం మేర నష్టపోయింది. రూపాయి పతనానికి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, గ్లోబల్ బాండ్ ఈల్డ్స్ భారీగా పెరగడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 111 డాలర్ల సమీపంలో కొనసాగుతోంది. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రూపాయి దాదాపు 5.7 శాతం విలువను కోల్పోయింది.
మరోవైపు అమెరికా బాండ్ల మార్కెట్లో వస్తున్న మార్పులు రూపాయిని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ 4.5 శాతానికి పైగా పెరగ్గా, 30 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ 5.1 శాతాన్ని దాటాయి. ఇది 2007 తర్వాత నమోదైన అత్యధిక స్థాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదని, దీనివల్ల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందనే అంచనాలు గ్లోబల్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. సీఎంఈ ఫెడ్‌వాచ్ టూల్ ప్రకారం, డిసెంబర్ నాటికి వడ్డీ రేట్ల పెంపు సంభావ్యత గత వారం ఉన్న 14 శాతం నుండి ఏకంగా 47 శాతానికి పెరిగింది.
ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి విలువ 97 రూపాయల స్థాయి వద్ద కొంత నిరోధాన్ని (రెసిస్టెన్స్) ఎదుర్కోవచ్చని, అయితే అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గకపోతే ఆ స్థాయి కూడా దాటి రూపాయి మరింత పతనమయ్యే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు ధరల భారం, అమెరికా వడ్డీ రేట్ల మార్పుల వల్ల డాలర్‌కు డిమాండ్ పెరిగి, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటంతో రూపాయి విలువ దారుణంగా కుప్పకూలుతోంది.
