సైకో కిల్లర్ మహ్మద్ ఖదీర్​కు జీవిత ఖైదు..శిక్ష విధించిన నాంపల్లి

సైకో కిల్లర్ మహ్మద్ ఖదీర్​కు జీవిత ఖైదు..శిక్ష విధించిన నాంపల్లి
  • మెట్రో పాలిటిన్ సెషన్స్ కోర్టు

అబిడ్స్/మెహిదీపట్నం, వెలుగు: మూడు హత్యలు చేసి చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న సైకో కిల్లర్ మహ్మద్ ఖదీర్ కు నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. నాంపల్లి, హబీబ్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బీదర్ జిల్లా హుమ్నాబాద్ మండలం బద్ధాల్ గ్రామానికి చెందిన మహ్మద్ ఖదీర్(46) ఉపాధి కోసం కొన్నేండ్ల కిందట సిటీకి వలస వచ్చాడు. బోరబండ ఏరియాలో ఉంటూ ఆటో నడిపేవాడు. మద్యానికి బానిసైన ఖదీర్ అర్ధరాత్రి వేళల్లో ఫుట్​పాత్​పై నిద్రపోయే వారిని టార్గెట్ చేసేవాడు. భిక్షాటన చేసే వారిని బండరాయితో కొట్టి దాడి చేయడం, వాళ్ల డబ్బులను లాక్కెళ్లడం చేసేవాడు.  

నాంపల్లిలోని బజార్​ఘాట్​కు చెందిన ముబారక్ అలీ భిక్షాటన చేసేవాడు. 2019 డిసెంబర్ 30న తెల్లవారుజామున బజార్ ఘాట్​లోని ఫుట్ పాత్ పై నిద్రపోతున్న ముబారక్ అలీని ఖదీర్ బండరాయితో కొట్టి చంపాడు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహ్మద్ ఖదీర్​ను అరెస్ట్ చేశారు. బెయిల్ పై బయటికొచ్చిన ఖదీర్ 2021 అక్టోబర్ 15న, 31న హబీబ్ నగర్ పీఎస్ పరిధిలో భిక్షాటన చేసే మరో ఇద్దరిని హత్య చేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. 2019లో జరిగిన హత్య కేసు శనివారం విచారణకు రాగా.. ఖదీర్ కు జీవిత ఖైదు విధిస్తూ నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు తీర్పునిచ్చింది.