న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం మోదీ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ‘‘మోదీ జీ.. ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే పదవి నుంచి తొలగించండి’’ అని నేరుగా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీ మౌనంగా ఉండడం దేశ యువతకు ద్రోహం చేయడమే అని ఆరోపించారు. 22 లక్షల మంది నీట్ విద్యార్థులు రెండేండ్లుగా రాత్రింబవళ్లు చదివారని, వారి కష్టమంతా వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షకు రెండు రోజుల ముందే నీట్ పేపర్ వాట్సాప్‌లో పంచారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం ‘‘నాకేం సంబంధం లేదు’’ అన్నట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. లీకేజీలు అరికట్టేందుకు కమిటీ చేసిన సిఫారసులను చెత్తబుట్టలో వేశారని నిందించారు. నీట్ పరీక్షను జూన్ 21న తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఆరెస్సెస్–బీజేపీతో విద్యావ్యవస్థ నాశనం
ఆరెస్సెస్, బీజేపీ, వర్సిటీ అధికారుల మధ్య డబ్బు సంపాదించే కూటమిలా మారిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ నెక్సస్ దేశ విద్యావ్యవస్థను నాశనం చేసిందని మండిపడ్డారు. వైస్ చాన్సలర్ పోస్టులు అర్హతల ప్రకారం కాదు, ఆరెస్సెస్‌తో ఎంత దగ్గరి సంబంధాలు ఉన్నాయనే దాని ఆధారంగా దక్కుతున్నాయని విమర్శించారు. దేశంలో 80 సార్లు పేపర్ లీక్ జరిగిందని, 2 కోట్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
