సహారా ఎడారిలో సముద్రం ఉండేదట

సహారా ఎడారిలో సముద్రం ఉండేదట

ఇప్పుడంటే సహారా ప్రపంచంలోనే పెద్ద ఎడారి. కానీ గతంలో రకరకాల సముద్ర జంతువులకు ఆవాసం. పెద్ద పెద్ద క్యాట్‌ఫిష్‌లు, సముద్ర పాములకు నిలయం. ఆ ఎడారిలో కొన్నేళ్లుగా పరిశోధన చేస్తున్న సైంటిస్టులు ఈ విషయం వెల్లడించారు. 1999, 2003, 2009ల్లో సహారాలో పరిశోధన చేసి ఇప్పుడున్న ఆఫ్రికా మధ్యలో సముద్రం ఉండేదని చెప్పారు. పక్కనున్న సముద్రంతో ప్రస్తుత నైజీరియా కింద కలిసేదని వివరించారు.సుమారు 50 మీటర్ల లోతు, 3 వేల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉండేదన్నారు. ఒకటిన్నర మీటర్ల క్యాట్‌ ఫిష్‌లు, 12 మీటర్ల సీ స్నేక్‌లు, 1.3 మీటర్ల పిక్నొడోంట్స్‌ (బాన్‌ ఫిష్‌ లాంటివి) అందులో ఉండేవని చెప్పారు. ఆ సముద్రాన్ని మ్యాప్‌ కూడా వేశారు.

5 నుంచి 10 కోట్ల ఏళ్ల కిందట

సైంటిస్టుల అంచనా ప్రకారం ఆఫ్రికా చుట్టూ, మధ్యలోనూ సముద్రం ఉండేది. సముద్రంలోకి నీరు రావడం, పోవడం జరుగుతుండేది. అలా పాత నీళ్లు పోతూ, కొత్త నీళ్లు వస్తుంటే కొత్తరకం జీవులు పుట్టుకొస్తుంటాయి. నీళ్లలో ఉన్న జంతువులూ ఎక్కువ బరువు, పొడవు పెరిగే చాన్స్‌ ఉంది. దీన్నే ఐలాండ్ జెయింటిజమ్ అంటారు. ఆ ప్రకారమే ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద జంతువులు, సముద్ర జీవులు ఉన్నాయని అంచనా వేశారు. ఇప్పుడున్న మాలి దేశం 5 నుంచి 10 కోట్ల ఏళ్ల క్రితం సముద్ర తీరంతో ప్యూర్టొరికోలా ఉండేదని చెప్పారు. ప్రస్తుత మాలిలో ఇసుక కింద సముద్రపు ఆనవాళ్లు కప్పి ఉన్నాయని, కనుగొనాలంటే చాలా శ్రమించాల్సి ఉందని వివరించారు. అక్కడి ప్రజలు కూడా తమకు సముద్రపు జంతువుల అవశేషాలు కనిపించాయని చెప్పారన్నారు.

పరిశోధన కష్టమైంది

మాలీ పరిశోధనలు చేయడం అంతా ఈజీగా జరగలేదని కూడా సైంటిస్టులు గుర్తు చేశారు. 2009లో పరిశోధన చేస్తుండగా మధ్యలోనే వెనక్కి రావాల్సి వచ్చిందని గుర్తు చేశారు.2012లో తువారెగ్‌ రెబల్స్‌, జిహాదిస్టులు మాలీని ఆక్రమించుకున్నాక పరిస్థితి దిగజారిందని చెప్పారు. చాలా కష్టపడి పరిశోధన చేయాల్సి వచ్చిందని వివరించారు.