
- కంపెనీ ఏఐ బ్రాంచ్‌కు హెడ్‌గా నియామకం
- బోర్డ్ రాజీనామా చేయకపోతే మానేస్తామన్న 500 మంది ఓపెన్ ఏఐ ఉద్యోగులు
న్యూఢిల్లీ: ఓపెన్ ఏఐ మాజీ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ మైక్రోసాఫ్ట్‌లో జాయిన్ కానున్నారు. ఈ కంపెనీ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రీసెర్చ్ బ్రాంచ్‌కు ఆయన హెడ్‌గా పనిచేస్తారు. శామ్ ఆల్ట్‌మన్‌ను ఓపెన్ ఏఐ బోర్డ్ తొలగించిన రెండు రోజుల్లోనే ఆయన మైక్రోసాఫ్ట్‌లో జాయిన్ కావడం విశేషం. ఓపెన్ ఏఐ ఫౌండర్లు శామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మాన్‌లు మైక్రోసాఫ్ట్‌లో జాయిన్ అవుతారని కంపెనీ చీఫ్ సత్య నాదెళ్ల ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వీడియో స్ట్రీమింగ్ సైట్ ట్విచ్ ఫౌండర్ ఎమ్మెట్ షీర్ ఓపెన్ ఏఐలో ఇంటెరిమ్ సీఈఓగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ ప్రకటన వచ్చిన తర్వాత ఆల్ట్‌మన్ మైక్రోసాఫ్ట్‌లో జాయిన్ అవుతున్నారన్న న్యూస్ బయటకు వచ్చింది. ఆల్ట్‌మన్‌ను తీసేశాక కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరా మురాటిని ఓపెన్ ఏఐ ఇంటెరిమ్ సీఈఓగా నియమించింది.
తాజాగా ఆమెను పక్కన పెట్టేసి షీర్‌ను నియమించింది. ఆయనకున్న స్కిల్స్‌తో ఓపెన్ ఏఐ ముందుకెళుతుందని ఈ కంపెనీ ప్రకటించింది. ‘ఓపెన్ ఏఐతో ఉన్న మా పార్ట్‌నర్ షిప్ కొనసాగుతుంది. మైక్రోసాఫ్ట్ ఇగ్నీట్‌లో ప్రకటించిన ఇన్నోవేటివ్ ప్రొడక్ట్‌లను తీసుకొస్తామన్న నమ్మకం ఉంది. ఎమ్మేట్ షీర్, ఓపెన్ ఏఐ లీడర్‌షిప్ టీమ్‌తో కలిసి పనిచేయడంపై ఆసక్తిగా ఉన్నాం. శామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మన్ మరికొంత మంది కొలీగ్స్‌తో కలిసి మైక్రోసాఫ్ట్ అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ టీమ్‌ను నడుపుతారు. వీరి సక్సెస్‌కు అవసరమయ్యే రిసోర్స్‌లను అందిస్తాం’ అని సత్య నాదెళ్ల వెల్లడించారు. మిషన్ కంటిన్యూ అవుతుందని శామ్ ఆల్ట్‌మాన్ ఆయన ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ఆయన రిప్లైకు సత్య నాదెళ్ల స్పందించారు. ఫౌండర్లు, ఇన్నోవేటర్లు ఎదగడానికి స్వేచ్ఛ ఇస్తున్నామని, గిట్‌హబ్, మోజాంగ్ స్టూడియోస్, లింక్డిన్‌లే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఆల్ట్‌మన్‌కు కూడా ఇలాంటి ట్రీట్‌మెంటే ఉంటుందని పేర్కొన్నారు.