హైదరాబాద్, వెలుగు: ప్రజా గాయకుడు, దివంగత గద్దర్ తెలంగాణ ఉద్యమానికి చేసిన సేవలు అనన్యసామాన్యమని సమాజ్ వాదీ పార్టీ కొనియాడింది. ఈ నేపథ్యంలో ఆయనను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ‘తెలంగాణ జాతిపిత’ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరులకు, ఉద్యమకారులకు తగిన గుర్తింపు దక్కాలని డిమాండ్ చేసింది. 1955 నుంచి 2014 వరకు జరిగిన పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ గుర్తించాలని పేర్కొంది. గురువారం సెక్రటేరియెట్ లో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే.కేశవరావుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్.సింహాద్రి, ప్రధాన కార్యదర్శి బండి సదానంద్ వినతిపత్రం సమర్పించారు.
ఉద్యమకారులందరూ ఒకే చోట ఉండేలా అన్ని వసతులతో కూడిన తెలంగాణ సిటీని నిర్మించాలని, అందులో వారికి ఉచితంగా ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 1,200 మంది అమరవీరుల జ్ఞాపకార్థం విగ్రహాలను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ భవనాలకు, విద్యాసంస్థలకు ఉద్యమకారుల పేర్లు పెట్టాలన్నారు. ఉద్యమకారుల కుటుంబాలకు పెన్షన్లు, ఉచిత విద్య, వైద్యం అందించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, జిల్లాల్లోని ఉద్యమకారులను గుర్తించి గౌరవించాలని సమాజ్ వాది పార్టీ కోరింది.
