ఆర్యన్ డ్రగ్స్ కేసు విచారణ నుంచి వాంఖడే తొలగింపు

ఆర్యన్ డ్రగ్స్ కేసు విచారణ నుంచి వాంఖడే తొలగింపు

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ బాధ్యతల నుంచి సమీర్ వాంఖడేను తొలగించారు. దీనికి సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)డీజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సమీర్ వాంఖడేపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వాంఖడే ఆధ్వర్యంలోని NCB ముంబై జోన్ ఆర్యన్ ఖాన్  కేసును విచారిస్తుండగా.. ఇకపై NCB సెంట్రల్ యూనిట్  దర్యాప్తు చేపట్టనుంది. వాంఖడేను తప్పించిన క్రమంలో ఇకపై NCBకి చెందిన ప్రత్యేక బృందం... ఆర్యన్ ఖాన్ వ్యవహారంతో సహా సంబంధం ఉన్న మొత్త 6 కేసుల విచారణను సెంట్రల్ యూనిట్ కు బదలాయించారు. ఎన్సీబీ అధికారి సంజయ్ సింగ్  ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు (సిట్) టీం విచారించనుంది.

డ్రగ్స్ కేసు బయట పడ్డ నాటి నుంచి  వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఆర్యన్ ఖాన్ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సాయిల్ అనే వ్యక్తి కూడా వాంఖడే పై  సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసు నుంచి ఆర్యన్ ఖాన్ ను తప్పించేందుకు సమీర్ వాంఖడే నుంచి రూ.25 కోట్లకు డిమాండ్ వచ్చిందని ప్రభాకర్ తెలిపారు. దీనికి సంబంధించి  ప్రభాకర్ అఫిడవిట్ కూడా దాఖలు చేశారు.

ఈ కేసు విచారణ నుంచి సమీర్ వాంఖడేను తప్పించినప్పటికీ .. ఎప్పట్లాగానే ఎన్సీబీ ముంబై జోన్ డైరెక్టర్ గా కొనసాగనున్నారు.