శామీర్ పేట కాల్పుల కేసులో నటుడికి రిమాండ్

శామీర్ పేట కాల్పుల కేసులో నటుడికి రిమాండ్

మేడ్చల్‌ మల్కాజ్ గిరి జిల్లా శామీర్‌పేట్‌లో  సెలబ్రిటీ క్లబ్ కాల్పుల కేసులో నటుడు మనోజ్‌ను పోలీసులు జులై 16వ తేదీ ఆదివారం రిమాండ్‌కు తరలించారు. మనోజ్కు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అల్వాల్‌లో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఆ తర్వాత అల్వాల్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు మనోజ్ను పోలీసులు రిమాండ్‌లోకి తీసుకున్నారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.  

శామీర్‌పేట్‌ సెలబ్రిటీ క్లబ్‌లో జులై 15వ తేదీ శనివారం కాల్పుల ఘటన సంచలనం రేపింది. సిద్ధార్థ దాస్‌ అనే వ్యక్తి...తన భార్య వద్దకు రాగా.. ఆమెతో సహజీవనం చేస్తున్న నటుడు మనోజ్తో గొడవ జరిగింది. ఈ క్రమంలో మనోజ్‌ ఎయిర్‌గన్‌తో సిద్ధార్థ దాస్‌పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల నుంచి తప్పించుకున్న సిద్ధార్థ్..శామీర్ పేట్ పోలీసులను ఆశ్రయించాడు. నటుడు మనోజ్ తనపై కాల్పులు జరిపాడని ఫిర్యాదు చేశాడు. దీంతో ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద మనోజ్‌పై కేసు నమోదు చేశారు. నిందితుడు మనోజ్ను జడ్జి ఎదుట హాజరు పరచగా..అతనికి రిమాండ్ విధించారు. 

2019లో విడాకులు..కోర్టు నుంచి ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందిన 49 ఏళ్ల సిద్దార్థ దాస్కు ఒడిశాలోని బరంపూర్ కు చెందిన 43 ఏళ్ల స్మితాదాస్తో 2003లో వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం 17 ఏళ్ల కుమారుడు, 13  కుమార్తె ఉన్నారు.  అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో....2019లో విడాకులు తీసుకున్నారు. తాను పిల్లలతో పాటు మరో చోట ఉంటానని....సిద్దార్థ్ను రానీయకుండా చూడాలంటూ స్మితా కోర్టును కోరింది. ఆ విధంగా ఆదేశాలు కూడా తెచ్చుకుంది. 

మూడేళ్లుగా సహజీవనం..

ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడే వారికి స్మితాదాస్ కౌన్సిలింగ్ ఇచ్చేది. అయితే శంభో శివ శంభో, వినాయకుడు వంటి సినిమాల్లో నటించిన 39 ఏళ్ల మనోజ్ మానసిక ఒత్తిడి కారణంగా గతంలో స్మితాదాస్ వద్దకు కౌన్సిలింగ్కు వచ్చేవాడు.  ఆ సమయంలో  వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారి సహజీవనానికి దారి తీసింది.  మూడేళ్లుగా స్మితా, మనోజ్ శామీర్ పేటలోని సెలబ్రిటీ విల్లాలో నివాసం ఉంటున్నారు. 

మనోజ్ పై స్మిత కొడుకు ఫిర్యాదు..

స్మితాదాస్ కొడుకు మనోజ్పై బాలల సంరక్షణ కమిటీకి ఫిర్యాదు చేశాడు. తనతో పాటు..తన చెల్లిని  చదువు విషయంలో మనోజ్ తీవ్రంగా దూషిస్తూ కొడుతున్నాడని జూన్ 12వ తేదీన స్మితా దాస్ కోడుకు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తల్లి వద్ద కానీ, వారి బంధువుల వద్ద కానీ ఉండనంటూ కొడుకు చెప్పాడు. దీంతో సీడబ్ల్యూసీ అధికారులు బాలుడిని సంరక్షణ గృహానికి తరలించారు. దీనిపై జులై 18వ తేదీ విచారణకు రావాలని స్మితాను సీడబ్ల్యూసీ అధికారులు ఆదేశించారు. ఈ విషయాన్ని అడుగుదామని సిద్దార్థ్ దాస్ జులై 15వ తేదీ శనివారం శామీర్ పేట్ సెలబ్రిటీ క్లబ్కు వెళ్లినట్లు తెలుస్తో్ంది. సిద్ధార్థ్ను చూడగానే స్మితా మనోజ్ను పిలిచింది. దీంతో ఆగ్రహానికి గురైన మనోజ్..ఏయిర్ గన్తో సిద్ధార్థ్ బెదిరిస్తూ కాల్పులు జరిపాడు. అక్కడి నుంచి తప్పించుకున్న సిద్ధార్థ్ దాస్..పోలీసులకు ఫిర్యాదు చేశాడు.