సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడు ముచ్చటే లేదు

సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడు ముచ్చటే లేదు

డీపీఆర్ లపై కేఆర్ఎంబీకి ఏపీ లెటర్

కొత్త ప్రాజెక్టు ల విషయం ఎత్తకుండా దాటవేత

మిగతావన్నీ పాత ప్రాజెక్టు లేనని వివరణ

 గుండ్రేవుల, ఆర్డీఎస్ రైట్ కెనాల్, వేదవతి డీపీఆర్ లు రెడీ అయ్యాక ఇస్తామంటూ మెలిక

హైదరాబాద్: వెలుగు: సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ ముచ్చటే ఎత్తకుండా డీపీఆర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. రాష్ట్ర విభజనకు ముందు కంప్లీట్ చేసిన ప్రాజెక్టుల డీపీఆర్లపై తమ రాష్ట్రానికి మరోసారి ఎలాంటి లెటర్లురాయొద్దని తీవ్ర స్వరంతోనే చెప్పింది. గుండ్రేవుల రిజర్వాయర్, ఆర్ఎస్ డీ రైట్ కెనాల్, వేదవతి రివర్ లిఫ్టులు స్కీములు మాత్రమే రాష్ట్ర విభజన తర్వాత చేపట్టామని, వాటి డీపీఆర్లు ఇంకా సిద్ధం కాలేదని తెలిపింది. ఆ డీపీఆర్ లు రెడీ అయ్యాక బోర్డుకు సమర్పిస్తామని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు శనివారం లేఖ రాసింది. వాటిని కొత్త ప్రాజెక్టుల లిస్టు నుంచి తొలగించండి ఏపీ ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నీటిని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తరలించేందుకు సంగమేశ్వరం లిఫ్ట్ స్కీంతోపాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతూ ఇటీవల జీవో నెం.203 ద్వారా అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఇచ్చింది. మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల సాగు, తాగునీటితో పాటు హైదరాబాద్ తాగునీరు అందకుండా చేసే ఈ కొత్త ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వంచేపట్టకుండా అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. ప్రతిగా తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ సర్కారు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదం ఢిల్లీ వరకు వెళ్లింది. రెండు రాష్ట్రాల జలవివాదాలపై చర్చించేందుకు జూన్ నాలుగు, ఐదు తేదీల్లో కృష్ణా , గోదావరి బోర్డుల సమావేశాలు నిర్వహించారు. ప్రాజెక్టుల డీపీఆర్ లే కేంద్రంగా ఈ రెండు సమావేశాలు జరిగాయి. ఇదే క్రమంలో డీపీఆర్ లు సమర్పించాలంటూ కేఆర్ఎంబీ రెండు సార్లు లెటర్లు రాయడంతో వాటికి సమాధానంగా ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి శనివారం కేఆర్ఎంబీకి లేఖ రాశారు. గురు రాఘవేంద్ర, సిద్దాపురం, శివభాష్యం లిఫ్ట్ స్కీములు, మున్నేరు స్కీం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే నిర్మాణం పూర్తయ్యాయని తెలిపారు. ముచ్చుమర్రి లిఫ్ట్ స్కీం  కూడా రాష్ట్ర విభజనకుముందే కంప్లీట్ చేశామని, అవేవి కొత్త ప్రాజెక్టులు కానే కావని పేర్కొన్నారు. కేఆర్ఎంబీ 12వ మీటింగ్ లో ఏపీ స్పెషల్ సీఎస్ ఆ ప్రాజెక్టులన్నీ విభజనకు ముందే చేపట్టినవేనని వివరించారన్నారు. వీటి డీపీఆర్ ల విషయంలో ఇంకా ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు ఆస్కారం లేదని, వాటిని కొత్త ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగించాలని తేల్చిచెప్పారు. ఆ ప్రాజెక్టులకు బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్  అనుమతి లేదని తెలిపారు. ఆ ప్రాజెక్టు ల డీపీఆర్ లు రెడీ కాలే..  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తమ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గుండ్రేవుల రిజర్వాయర్, ఆర్ఎడీ స్ రైట్ కెనాల్, వేదవతి (హగరి) నది లిఫ్ట్ స్కీములను మాత్రమే చేపట్టిందని కేఆర్ఎంబీకి రాసిన లేఖలో ఏపీ ఈఎన్సీ పేర్కొన్నారు. ఆయా ప్రాజెక్టుల డీపీఆర్లు ఇంకా సిద్ధం కాలేదని, డీపీఆర్ లు రెడీ అయిన తర్వాత కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ టెక్నికల్ అప్రైజల్, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం కోసం బోర్డుకు సమర్పిస్తామని వివరించారు.

అసలు ప్రాజెక్టుల సంగతేంది?

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీకి ప్రధాన కారణంగా నిలిచిన సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ అంశాన్ని ఏపీ తన లేఖలో ఒక్కటంటే ఒక్క ముక్క కూడా ప్రస్తావించలేదు. కేఆర్ఎంబీ ఏపీకి రాసిన లేఖల్లో జీవో నెం.203లోని ప్రాజెక్టుల డీపీఆర్ లు కూడా బోర్డు, సీడబ్ల్యూసీ టెక్నికల్ అప్రైజల్ కోసం సమర్పించాలని ఆదేశించింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి సాధించే వరకు అక్కడ ఎలాంటి పనులు చేపట్టవద్దని తేల్చిచెప్పింది. అయినా ఏపీ ప్రభుత్వం 203 జీవోలోని ప్రాజెక్టుల అంశంపై క్లారిటీ ఇవ్వ కుండా పాత ప్రాజెక్టుల డీపీఆర్ల ముచ్చట తోనే లెటర్ ను సరిపెట్టింది.