సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీ 14 రోజులు పొడిగింపు

సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీ 14 రోజులు పొడిగింపు

మనీ లాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు విధించిన జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు. మరో 14 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. పత్రాచావల్ ల్యాండ్ స్కామ్ లో నిందితుడికి  సంజయ్ రౌత్ సాయం చేశారనే ఆరోపణలతో ఈడీ అధికారులు ఆగష్టు 1న సంజయ్ రౌత్ ను అదుపులోకి తీసుకున్నారు. 2007లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం పత్రచావల్‌ ప్రాంతంలో 3వేల ఫ్లాట్లు నిర్మించడానికి గురు ఆశీష్ కన్‌స్ట్రక్షన్స్‌కు రూ.1034 కోట్ల విలువైన ప్రాజెక్ట్ కేటాయించింది. ఇందుకోసం 47 ఎకరాల భూమిని ఈ కంపెనీకి అప్పగించింది. గురుఆశీష్ కన్‌స్ట్రక్షన్స్‌ డైరెక్టర్లలో ఒకరైన ప్రవీణ్‌ రౌత్‌.. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు అత్యంత సన్నిహితుడు.

ప్రవీణ్ రౌత్ భార్య మాధురి సంజయ్‌ రౌత్ సతీమణి వర్షకు రూ. 55 లక్షలు వడ్డీలేని రుణం ఇచ్చినట్టు ఈడీ విచారణలో తేలింది. అంతేకాక, మాధురి, వర్షా  కలిసి ఆలీబాగ్‌లో ఓ భూమి కూడా కొన్నారు. ఈ ల్యాండ్ డీల్‌పైనా ఈడీ కూపీ లాగుతోంది. ఈ కేసులోనే రౌత్ ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసులో అరెస్ట్‌కు ముందు కూడా సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు." నా ఆస్తులు జప్తు చేయండి, కాల్పులు జరపండి, జైలుకు పంపండి,  ఏమాత్రం భయపడను. నేను బాలాసాహెబ్ ఠాక్రే అనుచరుడిని, నిజమైన శివసైనికుడిని" అంటూ రౌత్ అప్పట్లో కామెంట్ చేశారు.